నూకాంబికకు భక్త నీరాజనం
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:59 PM
సుమారు మూడేళ్ల తరువాత స్థానిక నూకాంబిక అమ్మవారి మూలవిరాట్ దర్శనం అందుబాటులోకి రావడంతో ఆదివారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
భక్తులతో ఆలయం కిటకిట
అనకాపల్లి టౌన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సుమారు మూడేళ్ల తరువాత స్థానిక నూకాంబిక అమ్మవారి మూలవిరాట్ దర్శనం అందుబాటులోకి రావడంతో ఆదివారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టిన తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయానికి భక్తుల తాకిడి అధికం కావడంతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోగా బయట కూడా క్యూలైన్‌లో భక్తులు రద్దీ కనిపించింది. అంతేకాకుండా ఉచిత దర్శనం భక్తులు రోడ్డుపైకి క్యూ కట్టారు. భక్తులు ఆలయ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో వంటలు తయారుచేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని సకుటుంబంగా భోజనాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆలయ ఆవరణమంతా భక్తులతో సందడిగా మారింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్, పాలకవర్గ సభ్యులు తగిన చర్యలు చేపట్టారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా, ఆలయానికి వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు సీఐ ఎం.వెంకటనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.