Share News

ఏయూలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:59 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

ఏయూలో అభివృద్ధి పనులకు శ్రీకారం

అంతర్గత రహదారులకు కొత్తరూపు

విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్‌ నూతన ప్రాజెక్టుల నిర్మాణాలను లాంఛనంగా ప్రారంభించారు. రూ.3.86 కోట్లతో క్యాంపస్‌లో గేట్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌, రూ.1.25 కోట్లతో స్నాతకోత్సవ మందిరం ఆధునికీకరణ, రూ.4.67 కోట్లతో నార్త్‌, సౌత్‌ క్యాంపస్‌లలో బీటీ రోడ్ల నిర్మాణం, రూ.4 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులు, రూ.2.75 కోట్లతో వైస్‌ చాన్సలర్‌ బంగ్లా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించిన శిలా ఫలకాలను శతాబ్ది ఉత్సవాల ముగింపు సమయంలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబునాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌ ఆవిష్కరించారు. టెండరింగ్‌ ప్రక్రియ పూర్తిచేసి పనులను ఇప్పుడు ప్రారంభించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ పులిపాటి కింగ్‌, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్‌ ఆర్‌.పద్మశ్రీ, ప్రొఫెసర్‌ ఎన్‌.చిట్టిబాబు, చీమలపాటి సూర్యనారాయణ శేఖర్‌, ప్రొఫెసర్‌ వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఇంజనీర్‌ వి.తిరుపతిరావు, ప్రిన్సిపాల్‌, డీన్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


ఘోష ఆస్పత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు

రూ.3 కోట్లతో ఆధునిక పరికరాలు

ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటుకు అధికారుల వినతి

విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):

ఘోష (విక్టోరియా) ఆస్పత్రి అభివృద్ధికి అధికారులు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన లభించిందని చెబుతున్నారు. సుమారు రూ.90 లక్షలతో అత్యాధునిక అడ్వాన్స్‌డ్‌ లాప్రోస్కోపీ సర్జరీకి సంబంధించిన మెషీన్‌ కొనుగోలు చేయనున్నారు. అలాగే అనస్థీషియా విభాగానికి సంబంధించి మత్తు ఇచ్చే స్టేషన్‌, సెంట్రల్‌ స్టెరాయిడ్‌ సప్లై డిపార్టుమెంట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టారు. ఇంకా ఐవీఎఫ్‌/ఏయూఐ సేవలు అందించేందుకు రూ.70 లక్షలతో సెంటర్‌ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఐవీఎఫ్‌/ఐయూఐ సెంటర్‌ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేసేందుకు ఆంధ్ర మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థులు కొందరు ముందుకువచ్చినట్టు చెబుతున్నారు. దీనికి మ్యాచింగ్‌ గ్రాంటుగా ప్రభుత్వం కొంత సమకూరిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఎంసీహెచ్‌ ఏర్పాటుచేయడం వల్ల మాతా, శిశు మరణాలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని, దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ శ్రీభరత్‌కు ఆస్పత్రి అధికారులు విన్నవించారు. రూ.70 లక్షలతో మాడ్యులర్‌ ఓటీ థియేటర్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, అందుకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన కీలక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషా ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒకే పీడియాట్రిక్‌ వైద్యుడు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ విభాగాన్ని ఏర్పాటుచేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటైతే గైనిక్‌, పీడియాట్రిక్‌ విభాగాలు ఒకేచోట సేవలు అందించేందుకు వీలుంటుందని, దీనివల్ల మాతా, శిశు మరణాలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక జన సాధారణ్‌ రైళ్లు

విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):

విజయవాడ-పలాస మధ్య దువ్వాడ మీదుగా ప్రత్యేక జన సాధారణ్‌ రైలు సర్వీసులు నడుపుతున్నామని అధికారులు తెలిపారు. విజయవాడ-పలాస ప్రత్యేక జన సాధారణ్‌ (07452) రైలు ఈ నెల 3, 4 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు దువ్వాడ, సాయంత్రం ఆరు గంటలకు పలాస చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పలాస-విజయవాడ ప్రత్యేక జన సాధారణ్‌ (07451) రైలు ఈ నెల 3, 4 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు పలాసలో బయలుదేరి రాత్రి 10.15 గంటలకు దువ్వాడ, మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు విజయవాడ చేరుతుంది.


యథేచ్ఛగా మాంసం విక్రయాలు

జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశించినా బేఖాతరు

పట్టించుకోని స్థానిక అధికారులు

అక్కయ్యపాలెం/ఎన్‌ఏడీ జంక్షన్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలో చికెన్‌, మటన్‌ దుకాణాలు, వైన్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ గురువారమే ఆదేశించారు. అయినప్పటికీ కొంతమంది ఆదేశాలను బేఖాతరు చేశారు. అక్కయ్యపాలెం, నరసింహనగర్‌, తదితర ప్రాంతాల్లో చికెన్‌ దుకాణాలు మూసివేసి, పక్క నుంచి మాంసం విక్రయాలను సాగించారు. కాగా ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి మర్రిపాలెం వెళ్లే సర్వీసు రోడ్డులోని చికెన్‌ దుకాణాన్ని ఉదయాన్నే తెరిచి మాంసం విక్రయాలు కొనసాగించారు. బాజీ జంక్షన్‌, కాకానినగర్‌ తదితర ప్రాంతాల్లో దుకాణాల షట్టర్లకు తాళాలు వేసి, పక్కనున్న షాపుల్లో వినియోగదారులను ఉంచి మాంసం విక్రయించారు. జీవీఎంసీ అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారంతో కొద్దిసేపు నిలిపివేసి, వారు వెళ్లిన తరువాత మళ్లీ విక్రయాలు చేపట్టారు.

Updated Date - Oct 03 , 2026 | 12:59 AM