అభివృద్ధి పనులు వేగవంతం
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:17 AM
జిల్లాలో అన్ని మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలి
తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి
పలు శాఖల అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అన్ని మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయ, విద్యుత్తు, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, జలవనరుల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు ఎల్‌నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీల్లో ఇళ్ల నుంచి ప్రతి రోజూ చెత్త సేకరణ జరగాలని, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, నాణ్యతలను నిరంతర పర్యవేక్షిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర పోర్టల్‌లో నిర్దేశిత గ్రామాల డేటాను గడువులోగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నెలకు రూ.10 వేల గౌరవ వేతనం అందుకుంటున్న క్లాప్ మిత్రలు సరిగ్గా పనిచేసేలా చూడాలన్నారు. ఒక్కో క్లాప్ మిత్ర రోజూ కనీసం 250 గృహాల నుంచి చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్టోబరు రెండో తేదీనాటికి అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవన నిర్మాణ పనులు పూర్తి కావాలని, ప్రతి స్వర్ణ వార్డు/ స్వర్ణ గ్రామం కార్యాలయంలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రాజ్‌కుమార్, డీపీఓ సందీప్, తదితరులు పాల్గొన్నారు.
సీతాఫలాల ధర తగ్గుముఖం
మాడుగుల సంతకు అధికంగా సరుకు రావడంతో రేటు తగ్గించేసిన వ్యాపారులు
మాడుగుల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
మండల కేంద్రంలో సోమవారం జరిగిన సంతో సీతాఫలాల ధరలు వినియోగదారులకు అందుబాటు ధరలో లభించాయి. గత వారంతో పోలిస్తే క్రేటుకు రూ.300 వరకు తగ్గింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని కందులపాలెం, కక్కి, సలుగు, దేవాపురం, పులుసుమామిడి, ఈదులపాలెం, వంట్లమామిడి, 12వ మైలు, దప్పాడ, తదితర గ్రామాల నుంచి గిరిజనులు మాడుగుల సంతకు సీతాఫలా లను తీసుకొచ్చారు. కొంతమంది కావిళ్లతో మరికొంతమంది క్రేట్లతో, బుట్టలతో మోసుకొచ్చారు. వీటిని కొనుగోలు చేయడానికి నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం, తుని, గాజువాక ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చారు. గత వారంతో పోలిస్తే.. ఈ వారం సీతాఫలాలు అధికంగా రావడంతో వ్యాపారులు ధరలు తగ్గించి బేరమాడడం మొదలుపెట్టారు. కావిడి (సుమారు వంద పండ్లు) సీతాఫలాలు పరిమాణాన్నిబట్టి రూ.1,000 నుంచి రూ.1,200లకు కొనుగోలు చేశారు. గత వారం కావిడి పండ్లు రూ.1,500కు అమ్ముడుపోయిన విషయాన్ని గిరిజనులు గుర్తుచేశారు. ఇక 150 పండ్లు వున్న క్రేటు సీతాఫలాలు గత వారం రూ.1,800కు వ్యాపారులు కొనుగోలు చేయగా.. ఈ వారం రూ.1,500కు పడిపోయింది. దీంతో గిరిజన ఒకింత నిరాశ చెందారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం
క్యూవీఎస్‌ఈ యాప్‌కు పలువురు బలి
500 డాలర్లు డిపాజిట్ చేస్తే.. రోజూ ఒక శాతం చొప్పున లాభమంటూ ప్రచారం
‘పేట, తుని పట్టణాల్లో వేలం వెర్రిగా డబ్బులు డిపాజిట్
ఆకస్మికంగా ఖాతాలు బ్లాక్ కావడంతో లబోదిబోమంటున్న బాధితులు
కొంపముంచిన డాలర్ డ్రీమ్స్
పాయకరావుపేట, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
డాలర్ల ఆశచూపి అమాయకులను దారుణంగా దోచేశారు. డాలర్ల ట్రేడింగ్, బోలెడు లాభాలు అంటూ చైన్ మార్కెంట్ ద్వారా పలువురిని మోసగించారు. క్యూవీఎస్‌ఈ యాప్ పేరిట మోసగాళ్లు విసిరిన వలలో తుని, పాయకరావుపేటలకు చెందిన ఎంతో మంది చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితుల్లో ఉద్యోగుల నుంచి కూలీల వరకు వున్నారు. కొంతమంది అత్యాశతో అప్పులుచేసి మరీ యాప్‌లో మదుపు పెట్టి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నారు. ఒక్కసారిగా యాప్ క్లోజ్ అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వివరాల్లోకి వెళితే...
క్యూవీఎస్‌ఈ (క్యాంట్ వెస్ట్ స్టాక్ ఎక్స్ఛేంజి) పేరుతో రెండేళ్ల కిత్రం ఒక ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ ప్రత్యక్షమైంది. ఈజీగా డాలర్లు సంపాదించవచ్చని ప్రచారం జరిగింది. ఈ యాప్‌లో 500 డాలర్ల (సుమారు రూ.50 వేలు) నుంచి 3,000 డాలర్ల (సుమారు రూ.3 లక్షలు) వరకు డిపాజిట్ చేస్తే ఒక కోడ్ పంపిస్తారు. ఈ కోడ్‌తో ప్రతి రోజూ యాప్‌ను ఓపెన్ చేసి ట్రేడింగ్ చేయాలి. ఇలా చేస్తే 500 డాలర్లు కట్టినవారికి రోజుకి ఒక శాతం.. అంటే సుమారు ఐదు డాలర్ల చొప్పున నెలకు 150 నుంచి 180 డాలర్ల లాభం వస్తుంది. ఈ సొమ్ము విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండడంతోపాటు ఈ స్కీమ్‌లోకి కొత్తగా ఎవరినైనా చేరిస్తే బోనస్ ఇస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో మొదట్లో డబ్బులు కట్టిన పలువురు.. తమ బంధువులు, స్నేహితులతో కూడా డబ్బులు కట్టించారు. ఈ క్రమంలో యాప్ నిర్వాహకులు పర్సంటేజీని మూడు శాతానికి పెంచుతున్నామని రెండు వారాల క్రితం ప్రకటించడంతో పాయకరావుపేట, తుని పట్టణాల్లో వందలాది మంది డబ్బులు డిపాజిట్ చేసి డాలర్ల ట్రేడింగ్‌లో చేరారు. అయితే ఆదివారం మధ్యాహ్నం డిపాజిట్‌దారుల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటన రావడంతో డబ్బులు కట్టిన వారంతా ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపటికే విత్‌డ్రాలు ఆపేయడంతో ఏం చేయాలో పాలుపోలేదు. క్యూవీఎస్‌ఈ యాప్ వల్ల పాయకరావుపేట, తుని పట్టణాల్లోనే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు మోసపోయినట్టు తెలిసింది.