Share News

అభివృద్ధి పనులు వేగవంతం

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:58 PM

జిల్లాలో వివిధ పథకాల్లో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, బర్త్‌ వెయిటింగ్‌ హాళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

- వివిధ శాఖల అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

- గడువులోగా పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

పాడేరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ పథకాల్లో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, బర్త్‌ వెయిటింగ్‌ హాళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పీహెచ్‌సీ, ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. విద్య, ఐసీడీఎస్‌, వివిధ ఇంజనీరింగ్‌ శాఖల మధ్య సమన్వయంతో ఆయా నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు టైమ్‌ లైన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, గడువులోగా పనులు పూర్తి చేయని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. అలాగే ఆయా భవన, రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఇచ్చిన గడువు మేరకు ఎంత వరకు పనులు చేశారనే దానిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. అంతకు ముందు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డేవిడ్‌రాజు, వేణుగోపాల్‌, ఎస్‌ఎంఐ ఈఈ ఆర్‌.రాజేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ బి.బాబు, హౌసింగ్‌ ఈఈ వి.రాజబాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీబీ నాగేశ్వరరావు, డివిజన్‌, మండల, సచివాలయ స్థాయిల్లోని ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 11:58 PM