Share News

శరవేగంగా బొర్రా గుహల అభివృద్ధి పనులు

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:07 AM

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. బొర్రా గుహల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌ 2.0 కింద రూ. 24.09 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.

శరవేగంగా బొర్రా గుహల అభివృద్ధి పనులు
ముఖద్వారం వద్ద ఆర్చ్‌ పనులు

- ఆర్చ్‌, రెస్టారెంట్‌, పార్కింగ్‌ పనులు చకచకా

- స్వదేశీ దర్శన్‌ నిధులతో కొత్తరూపు

అనంతగిరి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. బొర్రా గుహల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌ 2.0 కింద రూ. 24.09 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 మార్చి నెలలో జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్‌ నుంచి వర్చువల్‌ విధానంలో పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది పాటు పనులకు ఆటంకం ఏర్పడింది. రూ.24.09 కోట్లతో గుహల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పర్యాటకశాఖ ప్రణాళికలను రూపొందించి, టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. గత ఏడాది మార్చి నెలలో మరోసారి టెండర్‌ పిలిచి ఆ ఏడాది ఆగస్టు నెలలోనే పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ముఖద్వారం వద్ద ఆర్చ్‌ పనులతో పాటు గేటు, అలాగే బొర్రా గుహల లోపల మెట్ల పనులు, ముఖద్వారం వద్ద రెస్టారెంట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా వాహనాల పార్కింగ్‌ పనులు, పార్కింగ్‌ ప్రదేశంలోని ఆర్చ్‌ ఏర్పాటు చేయడంతో పాటుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు పర్యాటకశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పర్యాటకులను ఆకర్షించేలా..

బొర్రా గుహలకు దేశవిదేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. ఏడాదికి సుమారు 5 లక్షల నుంచి 8 లక్షల మంది వరకు పర్యాటకులు గుహలను సందర్శిస్తుంటారు. ఈ గుహలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా బొర్రా గుహల స్వాగత ద్వారం, గుహల వద్ద మరో ద్వారం ఏర్పాటు చేయనున్నారు. సువిశాల వాహనాల పార్కింగ్‌తో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకుల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు, దారిపొడవునా వీధిలైట్లు, క్యాష్‌లెస్‌ టికెట్‌ విధానం, రెస్టారెంట్‌, మరుగుదొడ్లు, పాత్‌వేలు, వ్యూపాయింట్లు, గుహల లోపల సహజసిద్ధ ప్రకృతి అందాలను మరింత సుందరంగా చూపించేలా లైట్లను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 01:07 AM