Share News

అభివృద్ధి పరుగులు

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:04 PM

జిల్లాలో ఎన్డీయే కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తోంది. గంజాయి కట్టడి, శాంతి భద్రతలు పరిరక్షణ, కాఫీ తోటల విస్తరణ, సంక్షేమ పథకాల అమలుపై గిరిజనం ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే ఎన్నికల్లో జీవో 3, గిరిజనులకు ప్రత్యేక పథకాలు అమలుపై చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినా... రానున్న కాలంలో అమలు చేస్తారనే ఆశాభావంతో ఉంది.

అభివృద్ధి పరుగులు
మన్యంలోని కాఫీ పండ్లు

సంక్షేమ పథకాల అమలుపై హర్షం

జిల్లాలో గంజాయి సాగు కట్టడి

మన్యంలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ

మారుమూల ప్రాంతాలకు రహదారులపై గిరిజనుల ఆనందం

అమలు కాని గిరిజన ప్రత్యేక పథకాలు

జీవో 3పై చంద్రబాబు హామీ అమలు కాకపోవడంపై అసంతృప్తి

రానున్న రోజుల్లోనైనా అమలు చేస్తారనే ఆశాభావం

నేటితో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై గిరిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల అభిప్రాయాలను ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. ప్రభుత్వం రెండేళ్ల పాలనపై వారంతా తగిన విధంగా స్పందించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో గంజాయి అడ్డాగా మారిన పాడేరు ఏజెన్సీని కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో గంజాయిని కట్టడి చేసింది. వైసీపీ పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పడంతోపాటు సామాన్యులు సైతం ఆందోళన చెందేలా ఉన్న దుస్థితిని గాడిన పెట్టిందని అంటున్నారు. ఎన్‌టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించడం, కుటుంబంలో ఇద్దరికి తల్లికి వందనం వర్తించడం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా ప్రోత్సాహం రూ.13 వేలు నుంచి రూ.20 వేలు చేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

గిరిజన ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధపై సానుకూలత

జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలతోపాటు అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో సైతం గత మూడు దఫాలుగా వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నప్పటికీ గిరిజన ప్రాంతంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు రోడ్లు నిర్మాణం జరుగుతుండడంపై గిరిజనులు ఆనందం వ ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సైతం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి శ్రద్ధ కనబరుస్తూ ఏజెన్సీలో పర్యటించడం విశేషంగా భావిస్తున్నారు. వాస్తవానికి కూటమి అభ్యర్థులను గెలిపించలేదనే కారణంతో గిరిజన ప్రాంతం వివక్ష చూపుతారని అందరూ భావించారు. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు తదితరాలతో విద్యాకానుకలు అందించడం విశేషం.

గంజాయి కట్టడిలో సఫలీకృతం

జిల్లాలో గంజాయిని కట్టడి చేయడంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందనే చెప్పాలి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు పాడేరు ఏజెన్సీలోనే ఉండేవి. దీంతో గంజాయి సాగు, రవాణాకు మన్యం అడ్డాగా ఉండడంతో రాష్ట్రానికి, ఈప్రాంతానికి చెడ్డపేరు రావడంతోపాటు మాదకద్రవ్యాల వినియోగం పెరిగింది. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా గంజాయి శాశ్వత నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఈగల్‌ బృందాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దింపి గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది. దీంతో ఏజెన్సీలో గంజాయిని పండించాలంటే భయపడేలా సాగుదారులు, స్మగ్లర్లను గుర్తించి కేసులు నమోదుతోపాటు వారికి శిక్షలు పడేలా చేయడంతో ఏజెన్సీలో గంజాయి సాగు ఊసే లేకుండా పోయింది. అయితే సరిహద్దు ఒడిశా ప్రాంతం నుంచి ఏజెన్సీ మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతున్న వైనాలపైనా పోలీసులు గట్టి నిఘా పెట్టి, అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. మాదకద్రవ్యాల వినియోగంపైనా పోలీసులు నిఘా పెట్టడడంతోపాటు యువత, విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పరివర్తన పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గంజాయి విషయంలో మాత్రం ప్రభుత్వ చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

గిరిజనుల ప్రత్యేక పథకాల అమల్లో వెనుకంజ

గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన గిరిజన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఎక్కువగా గిరిజనులు ఎదురుచూస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నేరుగా గిరిజనులకు లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రద్దయిన ఎస్‌టీ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందనే ఆశాభావంతో గిరిజనులున్నారు. తమ పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లో చదివించుకునే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం, ట్రైబల్‌ కార్పొరేషన్‌ ద్వారా రాయితీపై నిరుద్యోగులకు వాహనాలు, ఇతర స్వయం ఉపాధి పథకాలు అమలు, రాయితీపై వ్యవసాయ, ఉద్యానవన పరికరాలు పంపిణీ చేయాల్సి ఉంది. అలాగే జీవో 3పై ఎన్నికల సమయంలో నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మూడేళ్లైనా అమలు కాని పరిస్థితి, మెగా డీఎస్‌సీలో సైతం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎస్‌టీలకు కేవలం 86 టీచర్‌ పోస్టులు మాత్రమే దక్కడంపైనా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇంటింటికి కొళాయిల ద్వారా తాగునీటిని అందించే జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో గిరిజన పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు అధికమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇళ్లను మంజూరు చేయకపోగా కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1 లక్ష అదనపు ప్రోత్సాహం సైతం రెండేళ్లుగా అందించని పరిస్థితిపై లబ్ధిదారులు అసంతృప్తి చెందుతున్నారు.

లక్ష ఎకరాల్లో కాఫీతోటల అభివృద్ధి

కాఫీ పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులకు మరింత మేలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గతేడాది లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను రూ.202 కోట్లు మంజూరు చేసింది. రానున్న ఐదేళ్లలో ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఈఏడాది నీడ మొక్కల పంపిణీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా కాఫీ పంట ద్వారా గిరిజనులకు చక్కని ఆదాయం లభిస్తుండడంతో వారికి జీవన ప్రమాణాలు పెంచేందుకు కాఫీ తోటల అభివృద్ధి కీలకమని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే గిరిజనులు పండించే కాఫీకి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేందుకు ‘అరకు కాఫీ’ పేరిట ప్రతి సందర్భంలోనూ సీఎం చంద్రబాబునాయుడు గిరిజన కాఫీని ప్రమోట్‌ చేస్తుండడం విశేషం.

Updated Date - Jun 11 , 2026 | 11:04 PM