Share News

అతలాకుతలం

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:45 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. అనంతగిరి ఘాట్‌ మార్గంలో కొండ పైనుంచి నీరు ప్రవహించడంతో పాటు బీసుపురం వద్ద రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలను రెండు రోజులుగా నిలిపివేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా పాడేరు ఘాట్‌ మార్గంలోనే అరకులోయ, అనంతగిరి ప్రాంతాలకు చెందిన వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

అతలాకుతలం
సుంకరమెట్ట- కటికి రహదారిలో బల్యాగుడ- కరకవలస గ్రామాల మధ్య విరిగిపడిన కొండచరియలు

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

పలు చోట్ల ధ్వంసమైన రహదారులు

రెండు రోజులుగా అనంతగిరి ఘాట్‌లో నిలిచిన రాకపోకలు

అరకు మండలం బల్యాగుడ- కరకవలస గ్రామాల మధ్య విరిగిపడిన కొండచరియలు

పాడేరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. అనంతగిరి ఘాట్‌ మార్గంలో కొండ పైనుంచి నీరు ప్రవహించడంతో పాటు బీసుపురం వద్ద రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలను రెండు రోజులుగా నిలిపివేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా పాడేరు ఘాట్‌ మార్గంలోనే అరకులోయ, అనంతగిరి ప్రాంతాలకు చెందిన వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే మెయిన్‌రోడ్డులో జి.మాడుగుల సంతబయలు వద్ద రోడ్డు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించాలని పోలీసులు సూచించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్‌లో రోడ్డు కోతకు గురైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండడంతో జిల్లాలో ఘాట్‌ మార్గాల్లో రాత్రి వేళల్లో రాకపోకలను పోలీసులు నిషేధించారు. గెడ్డల వద్ద పోలీస్‌, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది కాపలా కొనసాగుతున్నది. బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు జిల్లా కేంద్రంలోని మెయిన్‌రోడ్డులో నాలుగు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాడేరు ఘాట్‌లో పలు చోట్ల చెట్లు కూలగా, రోడ్లు, భవనాల శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి వాటిని తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో 857 మిల్లీమీటర్ల వర్షం

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో గురువారం జిల్లాలో 857 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే పాడేరులో 152.2 మిల్లీమీటర్లు, జీకేవీధిలో 115.6, హుకుంపేటలో 108.2, అనంతగిరిలో 90.2, అరకులోయలో 70.2, జి.మాడుగులలో 67.8, ముంచంగిపుట్టులో 55.4, పెదబయలులో 51.0,చింతపల్లిలో 49.4, డుంబ్రిగుడలో 49.2, కొయ్యూరు మండలంలో 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

లంబసింగి ఘాట్‌లో...

చింతపల్లి: నర్సీపట్నం- చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్‌ తురబాడుగెడ్డ సమీపంలో రహదారికి అడ్డంగా భారీ వృక్షం కూలిపడింది. దీంతో రెండు గంటలపాటు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్నబ్‌ తుఫాను ప్రభావం వల్ల రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి ఈదురుగాలులు అధికమయ్యాయి. దీంతో గురువారం తెల్లవారుజామున లంబసింగి ఘాట్‌ తురబాడుగెడ్డ సమీపంలో భారీ వృక్షం కూలిపడిపోయింది. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన వృక్షశకలాలను తొలగించారు. రెండు గంటల తరువాత రాకపోకలు యథావిధిగా సాగాయి.

ధ్వంసమైన చెరువులవేనం రోడ్డు

తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి సమీపంలోని చెరువులవేనం గ్రామం, వ్యూపాయింట్‌కి వెళ్లే ప్రధాన రహదారి ధ్వంసమైంది. చెరువులవేనం- భీమసింగి ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయింది. రహదారి కోతకు గురై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రహదారి పైనుంచి వర్షపు నీరు ప్రవహిస్తున్నది. కొండ నుంచి రహదారిపైకి రాళ్లు, మట్టి కొట్టుకుని వచ్చాయి. దీంతో చెరువులవేనం వ్యూపాయింట్‌, గ్రామానికి ద్వి, నాలుగు చక్రాల వాహనాలు వెళ్లే పరిస్థితిలేదు.

అరకుకు నిలిచిన రాకపోకలు

అరకులోయ: అనంతగిరి మండలం బీసుపురం వద్ద రక్షణ గోడ కూలిపోవడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో అరకులోయకు గురువారం విశాఖ డెయిరీ పాల వ్యాన్‌ రాలేదు. దీని వల్ల పట్టణవాసులు ఇబ్బంది పడ్డారు. అరకులోయకు బొడ్డవర- అరకు మధ్య రాకపోకలు నిలిచిపోగా, చోడవరం- పాడేరు ఘాట్‌లోనూ గురువారం బస్సులను నిలిపివేశారు. అలాగే కొత్తవలస - కిరండూల్‌ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కేకే లైన్‌లో ఎక్కడికక్కడ ట్రాక్‌ దెబ్బతినడంతో వచ్చే నెల 5 వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. అరకుకు అన్ని వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

దెబ్బతిన్న రహదారులు

మండలంలో పలు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. సుంకరమెట్ట- బీసుపురం, అలాగే గాలికొండ- బీసుపురం మధ్య రహదారులు ధ్వంసమయ్యాయి. గురువారం తెల్లవారుజామున బల్యాగుడ- కరకవలస మధ్య కొండచరియలు విరిగిపడడంతో ఆ రహదారి మూసుకుపోయింది. కటికి రోడ్డు దెబ్బతిన్నది.

Updated Date - Oct 30 , 2026 | 12:45 AM