Share News

తుఫాన్‌ విధ్వంసం

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:31 AM

జిల్లాపై ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగానే ఉంది. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల ఘాట్‌రోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.

తుఫాన్‌ విధ్వంసం
బొర్రాగుహలు జంక్షన్‌కు వెళ్లే మార్గంలో కూలిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న దృశ్యం

చింతాలమ్మఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు

జిల్లాలో పలు చోట్ల రోడ్లపై పడిన చెట్లు

అరకు- విశాఖ ఘాట్‌రోడ్డులో కూలిన రక్షణ గోడ

ఘాట్‌రోడ్లలో రాకపోకలు నిలిపివేత

పాడేరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగానే ఉంది. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల ఘాట్‌రోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. అరకు- విశాఖ ఘాట్‌రోడ్డులో రక్షణ గోడ కూలిపోయింది. జిల్లాలో పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పర్యాటక ప్రాంతాలను మూసి వేశారు. వర్షాలకు డుంబ్రిగుడలోని చాపరాయి జలవిహారిలో ఫుట్‌పాత్‌ ధ్వంసమైౖంది.

అనంతగిరి ఘాట్‌ మార్గంలో కొండ పైనుంచి నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఘాట్‌ మార్గాల్లో రాత్రి వేళల్లో రాకపోకలను పోలీసులు నిషేధించారు. ప్రజలు గెడ్డలు దాటకుండా పోలీస్‌, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది కాపలా ఉంటున్నారు. జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతుండగా, కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌కలెక్టర్‌ కె.సాహిత్‌, మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

అరకులోయలో...

అరకులోయ: మండలంలో మంగళవారం ఉదయం ప్రారంభమైన వర్షం బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో సుంకరమెట్ట- గాలికొండ వ్యూపాయింట్‌ వద్ద కొండల పైనుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. అలాగే బుధవారం మధ్యాహ్నం బీసుపురం- బీసుపురం కాఫీ తోటల మధ్య ఒక మలుపు వద్ద రక్షణ గోడ కూలిపోయింది. దీంతో ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుంకరమెట్ట - గన్నెల జంక్షన్‌ రోడ్డు నుంచి రంపుడు మీదుగా కరకవలస-బొండాం కొత్తవలసకు వెళ్లే రహదారిపై మట్టిదిబ్బలు జారిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా బొర్రా-కరకవలస రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దెబ్బతిన్నాయి.

కొయ్యూరులో...

కొయ్యూరు: తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారి 516-ఈ మార్గంలోని చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు ఎస్‌ఐ కిషోర్‌వర్మ అక్కడికి చేరుకుని యుద్ధప్రాతిపదికన కొండచరియలను తొలగింపజేసి రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే కొయ్యూరు నుంచి రేవళ్లు వెళ్ళే ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం దాటాక తాటిచెట్టు రోడ్డుకు అడ్డుగా కూలింది. మంప వెళ్లే ప్రధాన రహదారి పొడవున చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. యు. చీడిపాలెం సమీప బండిగెడ్డ పొంగి ప్రవహిస్తున్నది.

అనంతగిరిలో..

అనంతగిరి: మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు వెళ్లే మార్గంలోని రైల్వే గేటు సమీపంలో కొండచరియలు జారిపడడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే అనంతగిరి కమలపురం-జామిగుడ రోడ్డులో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గూడెంకొత్తవీధిలో...

గూడెంకొత్తవీధి: మండలంలో తుఫాన్‌ ప్రభావం వల్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. వర్షానికి రంపుల ఘాట్‌లో కొండచరియలు రహదారిపై విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బొంతువలస ఘాట్‌లో నాలుగు చోట్ల భారీ వృక్షాలు పడిపోయాయి. వర్షం వల్ల జీకేవీధి మండలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

అరకులోయలో అత్యధిక వర్షపాతం

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అరకులోయ మండలంలో అత్యధికంగా 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, అనంతగిరిలో 162, హుకుంపేటలో 142, పాడేరులో 135, డుంబ్రిగుడలో 115, జి.మాడుగులలో 95, చింతపల్లిలో 76, పెదబయలులో 68, కొయ్యూరు, ముంచంగిపుట్టులో 58, జీకే వీధిలో 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Oct 29 , 2026 | 12:31 AM