Share News

నీటి వనరుల విధ్వంసం

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:14 AM

నీటి వనరుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కోట్లాది రూపాయలు వెచ్చించి ‘జలధార- జలహారతి’ పథకం కింద నీటి వనరుల అభివృద్ధి పనులు చేపడుతుంటే... మరోపక్క సహజ సిద్ధమైన నీటి వనరులను కొంతమంది అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, గెడ్డల ఆక్రమణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆదేశాలను మండలంలో అధికారులు అమలు చేయడంలేదు.

నీటి వనరుల విధ్వంసం
సబ్బవరం శివారు ఆదిరెడ్డిపాలెంలో గెడ్డవాగులో కూల్చివేసిన టేకు చెట్లు

‘జలధార- జలహారతి’కి అక్రమార్కుల తూట్లు

ఆదిరెడ్డిపాలెంలో గెడ్డవాగు దురాక్రమణ

గట్టుపైన, లోపల ఉన్న చెట్లు కూల్చివేత

పట్టించుకోని జలవనరులు, రెవెన్యూ అధికారులు

సబ్బవరం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): నీటి వనరుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కోట్లాది రూపాయలు వెచ్చించి ‘జలధార- జలహారతి’ పథకం కింద నీటి వనరుల అభివృద్ధి పనులు చేపడుతుంటే... మరోపక్క సహజ సిద్ధమైన నీటి వనరులను కొంతమంది అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, గెడ్డల ఆక్రమణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆదేశాలను మండలంలో అధికారులు అమలు చేయడంలేదు. తాజాగా సబ్బవరం శివారు ఆదిరెడ్డిపాలెం వద్ద సర్వే నంబరు 445లో ఉన్న 5.72 ఎకరాల (ఎల్‌పీ నంబరు 344) గెడ్డ వాగును కొంత మంది కబ్జా చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షం నీరు ఈ గెడ్డ ద్వారా విశాఖ నగరానికి తాగునీటిని అందించే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోకి చేరుతుంది. ఇటువంటి ప్రధానమైన గెడ్డను కొంతమంది ఆక్రమించి గట్టుపైన, గెడ్డ లోపల వున్న టేకుతోపాటు పలు జాతుల వృక్షాలను యంత్రాలతో కూల్చివేస్తున్నారు. కానీ జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహశీల్దారు డి.అరుణ్‌చంద్రను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. గెడ్డవాగులో చెట్లను కూల్చివేసిన వారిపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కూల్చేసిన టేకు చెట్లను లెక్కించి, అటవీ శాఖ అధికారులచేత ధర నిర్ణయించి, సదరు వ్యక్తుల నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలని ఆర్‌ఐ వీరయ్యను ఆదేశించినట్టు చెప్పారు.

గెడ్డవాగులో నిర్మాణం

మండలంలోని గొల్లలపాలెం సర్వే నంబరు 30లోని గెడ్డ వాగును ఆక్రమించి కొంత మంది రేకుల షెడ్ల నిర్మాణం చేపట్టారు. బయటకు కనిపించకుండా వుండేందుకు గ్రీన్‌మ్యాట్‌లను అడ్డుగా కట్టారు. వైసీపీ హయాంలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టగా, స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. మూడేళ్లు తరువాత మళ్లీ ఇప్పుడు గెడ్డవాగు భూమిలో షెడ్లు నిర్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 01:14 AM