వైసీపీలో నైరాశ్యం
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:17 AM
జీవీఎంసీతోపాటు ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది.
జీవీఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో నేతల్లో ఆందోళన
గ్రేటర్‌లో 120 వార్డులకు కేవలం 13 వార్డుల్లోనే పార్టీ అభ్యర్థుల గెలుపు
2021లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ 98 వార్డుల్లో 30 వార్డులు కైవసం
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీతోపాటు ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు (2021) జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేసి 98 వార్డులకుగాను 30 వార్డులను దక్కించుకోగలిగింది. కానీ, ప్రస్తుతం వార్డులు (120) పెరిగినా వైసీపీ కనీసం పదిహేను వార్డులు కూడా గెలుచుకోలేకపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2024 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూటమి దక్కించుకుంది. దీంతో కొన్నాళ్లు వైసీపీ నేతలు స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ప్రతిఫలిస్తుందని వైసీపీ నేతలు భావించారు. అందుకే ఎన్నికల ప్రకటన రాగానే హడావిడి చేశారు. జీవీఎంసీ మేయర్ పీఠంతోపాటు మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. అయితే 120 వార్డులకుగాను కూటమి 98 వార్డులను గెలుచుకోగా, వైసీపీ కేవలం 13 వార్డులకే పరిమితమైంది. మేయర్ పదవికి వైసీపీ నుంచి పోటీ చేసిన వరుదు కళ్యాణి ఏకంగా 2.4 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గ్రేటర్ ఫలితాలు వైసీపీ నేతలను షాక్‌కు గురిచేశాయి.
గ్రామీణ ప్రాంతంలోనూ...
జిల్లా పరిధిలోని నాలుగు మండలాల్లో కూడా పార్టీ పరిస్థితి అదే మాదిరిగా ఉందని ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. పెందుర్తి, పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జడ్పీటీసీలుగా మూడు మండలాల్లో టీడీపీ అభ్య ర్థులు, ఒకచోట జనసేన అభ్యర్థి గెలుపొందారు. అలాగే 53 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ 29, జనసేన ఎనిమిదింటిని కైవసం చేసుకున్నాయి. వైసీపీ కేవలం 16 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. సాధారణ ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లు దాటినా పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో నేతలు, కార్యకర్తలు నిరాశా నిస్పృహలో మునిగిపోయారు. ఈ క్రమంలో కొందరు పార్టీ కార్యాలయం వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు.