Share News

యువతలో నైరాశ్యం

ABN , Publish Date - Nov 03 , 2026 | 01:58 AM

జీవీఎంసీ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్‌ నమోదుకావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

యువతలో నైరాశ్యం

ఓటు వేసేందుకు దూరం

అవే హామీలు...వారే అభ్యర్థులని పెదవి విరుపు

రాజకీయాల పట్ల పెరుగుతున్న విముఖత

ఎవరు గెలిచినా చేసేదేమీ లేదన్న అభిప్రాయం

ఉద్యోగం, వ్యాపారాల్లో బిజీగా ఉండి మరికొందరు ఓటుకు దూరం

విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్‌ నమోదుకావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అధికశాతం మంది యువత ముందుకురాలేదు. ముఖ్యంగా జెన్‌జీ ఓటు వేయకపోవడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి కనిపించలేదు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కలేదని ఓటింగ్‌ శాతం రుజువుచేస్తోంది.

యువ ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండడానికి అనేక కారణాలు చెబుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయం ఎక్కువమంది యువతలో ఉందని చెబుతున్నారు. ఎవరు గెలిచినా మార్పు రాదని అభిప్రాయపడ్డారని, అవే హామీలు...వారే అభ్యర్థులు కావడంతో ఆసక్తి చూపలేదని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన యువతి రమ్య పేర్కొన్నారు. అవినీతి పెరిగిపోయిందని, డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని, దీనివల్ల మార్పు సాధ్యం కాదని ఎంవీపీ కాలనీకి చెందిన రాజేంద్ర అనే యువకుడు వివరించాడు. డబ్బు ప్రాధాన్యం పెరిగిపోవడంతో సేవ చేసే గుణం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు దూరమయ్యారని, ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న ఎవరికి ఓటు వేసినా మార్పురాదన్న ఉద్దేశంతో ఇంటికే పరిమితమయ్యానని ఆయన తెలిపారు.

మార్పుపై నమ్మకం లేకనే?

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సుపరిపాలన అందించే నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న, వాటిని పరిష్కరించగలిగే అంకితభావం కలిగిన నాయకులకు ఓటు వేసేందుకు ముందుకు వస్తారు. అయితే తాజా ఎన్నికల్లో అనేక వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పట్ల యువ ఓటర్లకు సదిభిప్రాయం కలగలేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువమంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ఏళ్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులే ఈ ఎన్నికల్లోనూ పోటీ చేశారని, వార్డులో వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, మళ్లీ వారే పోటీ పడుతుండడంతో ఓటు వేసినా ప్రయోజనం లేదని భావించే ఓటింగ్‌కు వెళ్లలేదని మధురవాడ ప్రాంతానికి చెందిన రాకేష్‌ పేర్కొన్నారు.

అమలుకు నోచని హామీలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రాజకీయ పార్టీలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మెరుగైన మౌలిక వసతులు, అభివృద్ధి వంటి హామీలు ఇస్తున్నాయని, కానీ ఆచరణలో చూపించడం లేదని యువత అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా తానొక్కడ్ని ఓటు వేయకపోతే నష్టం ఏమీ లేదనే అభిప్రాయమూ యువత ఓటింగ్‌ శాతం తగ్గడానికి కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఉద్యోగం, వ్యాపారం, ఇతర కారణాలతోనూ చాలా మంది పోలింగ్‌బూత్‌ల వైపు చూడలేదు. ఓటు వేసేందుకు ఆసక్తి ఉన్నా ప్రైవేటు ఉద్యోగులకు సెలవులు లభించక ఓటుకు దూరంగా ఉండిపోయామని తెలిపారు.

సోషల్‌ మీడియాలో హుషారు

ఓటు వేసేందుకు దూరంగా ఉన్న యువ ఓటర్లు సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఎంతోమంది తమ ప్రాంతాల్లోని సమస్యలు, ఇతర అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. యువత ఓటింగ్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆలోచించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని యువ ఓటర్లకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే వారిలో చైతన్యం వస్తుందని సూచిస్తున్నారు.

Updated Date - Nov 03 , 2026 | 01:58 AM