బోసిపోయిన రహదారులు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:40 AM
జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.
నగరానికి కనుమ ఎఫెక్ట్
మాంసం కొనుగోలుకు ఎగబడిన జనం
చికెన్, మటన్ దుకాణాల వద్ద క్యూలు
జిల్లాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఇక కనుమ రోజు నగరం మొత్తం బోసిపోయింది. రహదారులు ఖాళీగా కనిపించాయి. కాగా ఈ పండుగ రోజున మాంసాహారం తినడం ఆచారంగా వస్తుండడంతో చికెన్, మటన్ దుకాణాలు శుక్రవారం కిటకిటలాడాయి. ఎక్కువ మంది నాటుకోళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఆనందపురం, హనుమంతవాక, కొమ్మాది ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జోరుగా సాగాయి. కిలో నుంచి కిలోన్నర బరువు తూగే నాటుకోళ్లను రూ.వెయ్యి చొప్పున విక్రయించారు. పందెం కోళ్లు అయితే బరువును బట్టి రూ.1,700 నుంచి రూ.2వేల వరకు అమ్మారు. బాయిలర్ కోళ్ల మాంసం విక్రయించే దుకాణాల్లో స్కిన్‌లెస్ రూ.300కు విక్రయించారు. సాధారణంగా ఆదివారాల్లోనే ఈ రేటు ఉంటుంది. మిగిలిన రోజుల్లో కిలో రూ.40 నుంచి రూ.50 తక్కువకు విక్రయిస్తారు.
పండుగ సీజన్ కావడంతో కిలో రూ.300కే ఫిక్స్ చేశారు. మేక, గొర్రెపోతు మాంసాలు విక్రయించే మటన్ దుకాణాల్లో యథా ప్రకారం కిలో రూ.వెయ్యి చొప్పునే అమ్మారు. పండుగ అయినా పెద్దగా రద్దీలేదని, అత్యధికులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ఆదివారాల్లో జరిగేంత వ్యాపారం కూడా జరగలేదని, మోస్తారుగా సాగిందని పలువురు వర్తకులు తెలిపారు. పూజలు చేసే వారు శుక్రవారం రోజున మాంసాహారం తినరని, ఆ విధంగా కొంత బేరం తగ్గిందని, ఆదివారం బాగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
మద్యం దుకాణాల్లోనూ సందడి
నగరంలోని మద్యం దుకాణాల్లో కనుమ పండుగ సందర్భంగా ఉదయం నుంచే సందడి మొదలైంది. ఎక్కువగా వలస వచ్చిన కూలీలే సాయంత్రం కూలీ తీసుకున్న తరువాత మద్యం కొనుగోలు చేస్తారు. అలాంటి వారంతా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ఆశించిన మేర వ్యాపారం జరగలేదని, డల్‌గా ఉందని సిండికేట్ వర్గాలు పేర్కొన్నాయి.
బోసిపోయిన రహదారులు
సంక్రాంతి పండుగకు ఈసారి సెలవులు కలిసి రావడంతో చాలామంది కుటుంబాలతో సహా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. వారింకా తిరుగు ప్రయాణమవలేదు. కనుమ పండుగ తరువాత కొందరు, ఆదివారం సెలవు చూసుకొని మరికొందరు తిరిగి రావాలని ప్రణాళిక వేసుకోవడంతో నగరంలో రహదారులు బోసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సుల సంఖ్య భారీగా తగ్గించేసింది. డిమాండ్ లేనపుడు ఖాళీగా నడటం వృథా అని అరకొరగానే నడిపింది. శని, ఆదివారాల్లో తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. రెగ్యులర్ సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులను శ్రీకాకుళం, విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, పాలకొండ, నర్సీపట్నం, తుని, విజయవాడ తదితర ప్రాంతాలకు వేస్తామన్నారు.
ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్
ఏమూ ఇంజనీరింగ్ కాలేజీ రహదారి సంక్రాంతి రోజున (గురువారం) ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయింది. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి వేదికపై గోదా రంగనాథుల కల్యాణం నిర్వహించడం, సంప్రదాయ సంబరాలన్నీ ఏర్పాటు చేయడంతో నగరంలోని వారంతా వాహనాల్లో చేరుకున్నారు. పెదవాల్తేరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి వాహనాలను అనుమతించలేదు. దాంతో చాలా మంది వీఐపీ మార్గంలోకి మళ్లి రామాటాకీస్ మీదుగా మద్దిలపాలెం చేరుకుని, అక్కడి నుంచి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, సిబ్బంది కూడా సెలవులకు వెళ్లడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొనాల్సి వచ్చింది.