23న డిప్యూటీ మేయర్ ఎన్నిక
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:21 AM
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈనెల 23న జరగనున్నది.
అదేరోజు మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈనెల 23న జరగనున్నది. ఈ మేరకు అనుసరించాల్సిన నిబంధనలను వివరిస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. ఈనెల 23న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి...మేయర్, కార్పొరేటర్లుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. జీవీఎంసీ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ప్రారంభమైన తర్వాత మేయర్, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. డిప్యూటీ మేయర్‌గా పోటీ చేయాలనుకున్న సభ్యుడిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొక సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. డిప్యూటీ మేయర్‌గా పోటీ చేసే సభ్యుడు ఏ రాజకీయపార్టీ తరఫున పోటీ చేస్తే ఆపార్టీ నుంచి బీ ఫారం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ మేయర్ పదవికి ఒకరికంటే ఎక్కువ మంది పోటీకి దిగితే ప్రత్యేక అధికారి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. పోటీలో ఉన్న సభ్యుడి పేరు, మద్దతు ఇచ్చే రాజకీయపార్టీ పేరుతోపాటు ప్రతిపాదించిన సభ్యుడు, బలపరిచిన సభ్యుడి పేర్లను చదివి వినిపించాల్సి ఉంటుంది. తర్వాత సభ్యులు చేతులెత్తే విధానంలో తమ ఓటును తెలియజేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఎవరికి చేతులెత్తి ఓటేస్తే వారు ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. అలాకాకుండా ఒక్కరే పోటీలో నిలిస్తే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.
ఇదిలావుండగా ప్రథమ సమావేశానికి కౌన్సిల్హాలును సిద్ధం చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో 98 మంది సభ్యులు ఉండగా, ఇప్పుడు 120కి పెరగడంతో అందుకు వీలుగా ఏర్పాట్లుచేస్తున్నారు. కౌన్సిల్ హాలులో వెనుక వైపు సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాటుచేసిన గ్యాలరీని తొలగించి అక్కడ సభ్యుల కోసం కుర్చీలు వేస్తున్నారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి 53.7%
వైసీపీకి 46.3 శాతం ఓట్లు
జిల్లాలో 53 స్థానాల్లో కూటమికి 36, వైసీపీకి 16 స్థానాలు
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని నాలుగు మండలాల్లో గల 52 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు 53.7 శాతం ఓట్లు సాధించాయి. వైసీపీ 46.3 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఈనెల ఐదో తేదీన ఎన్నికలు జరగ్గా, ఏడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 52 ఎంపీటీసీల్లో కూటమి 36 స్థానాలు (ఒకటి ఏకగ్రీవం కావడంతో 37 స్థానాలు), వైసీపీ 16 స్థానాలు గెలుచుకున్నాయి.
ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 1,30,752 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 1,26,486 ఓట్లు చెల్లినట్టు అధికారులు ప్రకటించారు. అందులో కూటమి పార్టీలకు 67,567 ఓట్లు రాగా వైసీపీకి 58,318 వచ్చాయి. కూటమిలో తెలుగుదేశం పార్టీకి 52,629 ఓట్లు, జనసేనకు 14,292 ఓట్లు, బీజేపీకీ 646 ఓట్లు వచ్చాయి. ఆనందపురం మండలంలో పోలైన 44,092 ఓట్లలో 42,672 ఓట్లు చెల్లగా...1,116 ఓట్లు తిరస్కరించారు. టీడీపీ పోటీ చేసిన 11 స్థానాల్లో 14,826 ఓట్లు, జనసేనకు ఐదుచోట్ల 7,056 ఓట్లు, బీజేపీ ఒకచోట పోటీచేయగా కేవలం 517 ఓట్లు, వైసీపీ పోటీ చేసిన 17 స్థానాల్లో 20,291 ఓట్లు వచ్చాయి. ఈ మండలంలో కూటమి పార్టీలకు 22,399 ఓట్లు వచ్చాయి. కూటమికి 10, వైసీపీకి ఏడు స్థానాలు వచ్చాయి.
భీమిలి మండలంలో 36,943 ఓట్లకుగాను 29,943 పోలయ్యాయి. వీటిలో చెల్లిన ఓట్లు 28,954 కాగా నోటాకు 209 ఓట్లు వచ్చాయి. మొత్తం 12 స్థానాలలో పదిచోట్ల కూటమి, వైసీపీ రెండుచోట్ల గెలుపొందాయి. కూటమిలో టీడీపీకి 15,172, జనసేనకు 1,150 కలిపి 16,322 ఓట్లు రాగా వైసీపీకి 12,627 ఓట్లు వచ్చాయి. పద్మనాభం మండలంలో 42,888 ఓట్లు ఉండగా 34,818 ఓట్లు పోలయ్యాయి. చెల్లిన ఓట్లు 33,350 కాగా 268 ఓట్లు నోటాకు పడ్డాయి. టీడీపీకి 16,644, జనసేనకు 815, బీజేపీకి 129 ఓట్లు...మొత్తం 17,588 ఓట్లు కూటమికిరాగా వైసీపీకి 15,429 ఓట్లు వచ్చాయి. మొత్తం 15 స్థానాలు ఉండగా 11 చోట్ల టీడీపీ, నాలుగుచోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పెందుర్తి మండలంలో 26,737 ఓట్లకుగాను 21,908 ఓట్లు పోలవ్వగా 21,310 ఓట్లు చెల్లాయి. మొత్తం తొమ్మిది స్థానాలకుగాను పెదగాడి ఏకగ్రీవ (జనసేన) అయ్యింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీకి మూడు, జనసేనకు రెండు, వైసీపీకి మూడు స్థానాలు వచ్చాయి. ఎన్నికల్లో టీడీపీకి 5,987 ఓట్లు, జనసేనకు 5281 ఓట్లు...మొత్తం 11,268 ఓట్లు రాగా వైసీపీకి 9,971 ఓట్లు వచ్చాయి.
జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 53.344%
వైసీపీకి 45.464 శాతం
నాలుగు జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలకు 53.344 శాతం, వైసీపీకి 45.464 శాతం ఓట్లు వచ్చాయి. నాలుగు మండలాల్లో 1,29,710 ఓట్లు చెల్లుబాటు కాగా టీడీపీ, జనసేనలకు 69,193 ఓట్లు, వైసీపీకి 58,972 ఓట్లు వచ్చాయి. కూటమిలో టీడీపీ అభ్యర్థులకు 47,416, జనసేనకు 21,777 ఓట్లు వచ్చాయి. ఆనందపురం జడ్పీటీసీలో మొత్తం 44,086 ఓట్లు పోలవ్వగా 42,801 ఓట్లు చెల్లాయి. ఇందులో జనసేన అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావుకు 21,777, వైసీపీ అభ్యర్థి మజ్జి వెంకటరావుకు 20,228 ఓట్లు వచ్చాయి. భీమిలిలో 28,747 ఓట్లు పోలవ్వగా టీడీపీ అభ్యర్థి గాడు అలివేణికి 16,137 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 11,998 ఓట్లు వచ్చాయి. పద్మనాభం మండలంలో 33,466 ఓట్లకుగాను టీడీపీ అభ్యర్థి కోరాడ సత్యవతికి 18,828 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కోరాడ మంజుకు 15,137 ఓట్లు వచ్చాయి. పెందుర్తిలో 31,125 ఓట్లకుగాను 24,696 ఓట్లు చెల్లుబాటు కాగా టీడీపీ అభ్యర్థి సుఖవాసి అజయ్‌కు 12,991 ఓట్లు, రాగా వైసీపీకి అభ్యర్థి కోడిగుడ్ల దేవీసాంబమూర్తికి 11,576 ఓట్లు వచ్చాయి.