Share News

గుండెపోటుతో పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జయరాజు మృతి

ABN , Publish Date - Sep 11 , 2026 | 10:55 PM

అల్లూరి జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జయరాజు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

గుండెపోటుతో పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జయరాజు మృతి
డాక్టర్‌.జయరాజు

జేసీ, ఐటీడీఏ పీవో, డీఆర్‌వో సంతాపం

పాడేరురూరల్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జయరాజు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన హఠాన్మరణం పట్ల అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. డాక్టర్‌.జయరాజు పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపార్రు గ్రామానికి అధికారులు దగ్గరుండి తరలించారు. పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా జయరాజ్‌ 2025 జూలై నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. జయరాజ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లాలో పశువైద్యాధికారులు భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌.ఎం.జయరాజు అకాల మరణం ఎంతో బాధించిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ అన్నారు. జయరాజు మృతి విషయం తెలుసుకున్న ఆమె ఐటీడీఏ సమావేశ మందిరంలో మృతికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఆర్డీవో ఎం.భుజంగరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో కలిసి నివాళులు అర్పించారు.

Updated Date - Sep 11 , 2026 | 10:55 PM