Share News

నేడు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పాడేరు రాక

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:01 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు రానున్నారు.

నేడు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పాడేరు రాక

నందిగరువు గ్రామానికి నిర్మించిన రహదారి పరిశీలన

పాడేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆయన విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో ఉదయం పది గంటలకు పాడేరు మండలం లగిశపల్లి వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పదిన్నర గంటలకు ఓనూరు జంక్షన్‌కు చేరుకుంటారు. ఓనూరు జంక్షన్‌ నుంచి వంట్లమామిడి పంచాయతీ నందిగరువు గ్రామానికి కాలినడకన వెళతారు. ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన కింద రూ.1.7 కోట్లతో నిర్మించిన రోడ్డును ఉప ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. గ్రామంలో సుమారు గంట సమయం గిరిజనులతో మాటామంతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత లగిశపల్లి చేరుకుని రెండున్నర గంటలకు హెలికాప్టర్‌లో విశాఖపట్నం తిరుగు ప్రయాణమవుతారు.


నేడు స్టీల్‌ప్లాంటు సీఎండీ పోస్టుకు ఇంటర్వ్యూలు

విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-విశాఖ ఉక్కు) చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టుకు శనివారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సెయిల్‌కు చెందిన మైనింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌రాజ్‌ ఇన్‌చార్జి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇది అదనపు బాధ్యత కాబట్టి పూర్తిస్థాయిలో నిర్ణయాలు ఏమీ తీసుకోవడం లేదు. వీలైనంత త్వరగా ఈ పోస్టును భర్తీ చేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం వడబోసి 14 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వారిలో శనివారం ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ తరువాత నియమాకపు ప్రక్రియ పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుంది.


రెవెన్యూ మాయ!

డీపట్టా భూములకు మ్యుటేషన్‌

సంగివలసలో వెలుగుచూసిన బాగోతం

విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

అసైన్డ్‌ భూమిని జిరాయితీగా మార్చి దానిని విక్రయించే ప్రయత్నాలకు రెవెన్యూ అధికారులు పూర్తిగా అండదండలు అందిస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల విలువైన భూమిని వాటాలు వేసి పంచేసుకుంటున్నారు. అందులో ఒక పెద్ద మనిషికి 3.75 ఎకరాల భూమిని మ్యుటేషన్‌ కూడా చేసేశారు. ఇది ఎలా సాధ్యమనేది భీమిలి మండల రెవెన్యూ అధికారులే చెప్పాలి.

భీమిలి మండలం సంగివలస సర్వే నంబరు 285లో ఐదు ఎకరాలకు 1990లో ఒక మహిళకు డీపట్టా ఇచ్చారు. అది రికార్డుల్లో డీపట్టాగానే ఉంది. ఆ తరువాత వెబ్‌ ల్యాండ్‌ వచ్చిన 2012-13 సమయంలో ఆ భూమిని జిరాయితీగా రికార్డుల్లో నమోదు చేశారు. ఎలా వచ్చింది? అనే ఎంజాయ్‌మెంట్‌ విభాగంలో మాత్రం డీపట్టాగానే చూపించారు. ఆ తరువాత ఆ మహిళ చనిపోవడంతో వారసులు ఆ భూమిని పంచుకోవడంలో విభేదాలు వచ్చాయి. అందులో ఒకరు ఫిర్యాదు చేయడంతో దాంతో కథ రోడ్డు మీదకు వచ్చింది. అంతా చర్చించుకొని ఐదు ఎకరాల్లో 3.75 ఎకరాలు ఒక పెద్ద మనిషికి విక్రయించేశారు. దీనిని చట్టబద్ధం చేయడానికి ‘మ్యుటేషన్‌’ కూడా చేసేశారు. అసైన్డ్‌ భూములు వారసులు అనుభవించాలే తప్ప విక్రయించడానికి అవకాశం లేదు. వాటిని అధికారులు మ్యుటేషన్‌ చేయడానికి కూడా వీల్లేదు. కానీ ఇక్కడ జరిగిపోయింది. ఒక వైపు వంశ పారంపర్యంగా వచ్చిన అసైన్డ్‌ భూమి అని చెబుతూ, మరో వైపు రికార్డుల్లో జిరాయితీగా పేర్కొనడం వల్లే ఇదంతా జరిగిందని ఫిర్యాదులు అందడంతో రెవె న్యూ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పైగా 22-ఏలో ఉన్న సర్వే నంబరుని మ్యుటేషన్‌ చేశారని, ఇంత ధైర్యం ఎవరికి ఉందని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇలా వెబ్‌ల్యాండ్‌లో డీపట్టా భూములను జిరాయితీలుగా చూపించి, చాలా భూములు కొల్లగొట్టేశారని, వాటిపై కూడా విచారణ చేయాలని అక్కడి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఎండాడ-కొమ్మాది వాటర్‌ పైప్‌లైన్‌ మార్పు

ప్రతిపాదనలు సిద్ధం.. ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి మధురవాడ, ఐటీ హిల్స్‌, కొమ్మాది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న తాగునీటి సరఫరా పైప్‌లైన్‌ను మార్చాలని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 15వ ఆర్థికసంఘం నిధులను వెచ్చించాలని ప్రతిపాదనలు తయారుచేసి కమిషనర్‌కు పంపించారు. ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పీఎం పాలెం, ఐటీ హిల్స్‌, హరిత, రుషికొండ, మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు తాగునీటిని హెచ్‌డీ పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే ఆ పైప్‌లైన్‌ డ్రైనేజీలో ఉంది. పైప్‌లైన్‌కు పొరపాటున ఏమాత్రం చిన్న రంధ్రం పడినా, జాయింట్‌ల వద్ద లీకైనా మురుగునీరు చేరి తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై ‘ఇంత ఘోరమా!?’ శీర్షికన ఈనెల 11న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దీంతో నగరంలోని ప్రజా ప్రతినిధులతోపాటు జీవీఎంసీ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ స్పందించారు. తక్షణం పైప్‌లైన్‌ను వేరొకచోటకు తరలించేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వారు ప్రతిపాదనలు తయారుచేసి కమిషనర్‌కు పంపించినట్టు తెలిసింది.

Updated Date - Mar 14 , 2026 | 01:01 AM