ఏనుగుల దినోత్సవానికి ఉప ముఖ్యమంత్రి హాజరు
ABN , Publish Date - Aug 14 , 2026 | 01:08 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ గురువారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా రుషికొండలోని రాడిసిన్‌బ్లూ హోటల్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
ఏనుగుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న కొణిదెల పవన్‌కల్యాణ్
విశాఖపట్నం, గోపాలపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ గురువారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా రుషికొండలోని రాడిసిన్‌బ్లూ హోటల్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు. అటవీ శాఖ రూపొందించిన ‘ప్రాజెక్టు ఎలిఫెంట్-30 జెయింట్ స్టెప్స్’ పుస్తకాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్‌సింగ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 21,450 పాఠశాలల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్ర కలంకారీ కళాకారులు రూపొందించిన కళాఖండాలతో ఏర్పాటుచేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ లేకుండా సహజీవనం సాగించే పరిస్థితులే నిజమైన అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
విమానాశ్రయంలో ఘన స్వాగతం
ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 9.30 గంటలకు గన్నవారం నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, సుందరపు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, రాష్ట్ర జానపద, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్, పలువురు పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం తిరిగి 12.30 గంటలకు పవన్‌కల్యాణ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు వీడ్కోలు పలికారు. ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.