దిగజారుతున్న భూగర్భ జలాలు
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:19 AM
పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.
నర్సీపట్నంలో పలుచోట్ల అడుగంటిన బోర్లు
మరింత లోతుగా కొత్త బోర్లు వేయిస్తున్న పట్టణవాసులు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఎండిపోయిన వరహా నది
పని చేయని దుగ్గాడ వాటర్ స్కీమ్
ప్రత్యామ్నాయంగా బోర్లు నుంచి నీరు సరఫరా
నర్సీపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. వెంకునాయుడుపేట, శారదానగర్‌లో బోర్లు ఎండి పోవడంతో వాటిని మరింత లోతు చేస్తున్నారు. కొంతమంది పాత బోరును మూసేసి కొత్తగా బోరు తవ్వించుకుంటున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి ఇప్పటి వరకు కనీసస్థాయిలో కూడా వర్షాలు పడక పోవడంతో ఆ ప్రభావం భూగర్భ జలాల మీద పడింది. పట్టణంలోని శారదానగర్‌లో ఈ సమస్య అధికంగా ఉంది. గతంలో 200 అడుగుల లోతున బోరు వేసే.. నీరు సమృద్ధిగా వచ్చేది. ఇప్పుడు 300 నుంచి 400 అడుగుల వరకు బోరు వేయాల్సి వస్తున్నది. బోరు తవ్వకం, కేసింగ్, మోటారు కోసం సుమారు లక్ష రూపాయల ఖర్చు చేయాల్సి వస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిండడానికి 30 నిమిషాలపాటు మోటార్ నడిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు భూగర్భ జలాలు బాగా పడిపోవడంతో ట్యాంకు నిండడానికి గంటకుపైగా సమయం పడుతున్నది.
వరహా నది వెలవెల
బలిఘట్టం మీదుగా ప్రవహిస్తున్న వరహా నదిలో నీరు లేదు. చుట్టు పక్కల చెరువుల్లో నీరు లేదు. మరోవైపు వర్షాలు పడకపోగా వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. దీంతో భూగర్భ జలాల నానాటికీ దిగజారిపోతున్నాయి. వరహా నదిలో నీరు లేక పోవడంతో పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే పథకాల్లో ఒకటైన దుగ్గాడలోని మంచినీటి పథకం పనిచేయడం లేదు. ప్రజలు ఇబ్బంది పడకుండా వుండేందుకు మునిసిపల్ అధికారులు దుగ్గాడలో నాలుగు, ఉత్తరవాహిని వద్ద ఐదు బోర్లు నుంచి మోటార్లతో నీటిని తోడి పట్టణవాసులకు సరఫరా చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు కొళాయిల ద్వారా రోజు తాగునీరు సరఫరా అయ్యేంది. ప్రస్తుతం రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా దుగ్గాడలో నీరు లేకపోతే గొలుగొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించి మంచినీటి అవసరాలకు వాడుకునే వారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో రావణాపల్లి సైతం అడుగంటింది.