పడిపోతున్న భూగర్భ జలాలు!
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:39 AM
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి.
శివారు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి
ఎండాడలో 30.37 మీటర్ల కిందికి...
మధురవాడలో 27.06 మీటర్ల లోతుకు
పెదరుషికొండలోనూ 22.84 మీటర్ల దిగువన...
నగరంలోనూ కొన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి
సరైన వర్షాలు కురవకుంటే
పరిస్థితి మరింత ఆందోళనకరం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. భారీ అపార్టుమెంట్ల నిర్మాణం, వాటికి అవసరమైన నీటి కోసం పెద్ద పెద్ద బోర్లను వేయడం వల్ల నీటి నిల్వలు కిందికి వెళ్లిపోతున్నాయి. ఎండాడలో పరిస్థితి దారుణంగా ఉంది. భూ ఉపరితలం నుంచి 30.37 మీటర్ల కిందికి నీటి నిల్వలు పడిపోయాయి. మధురవాడలో 27.06 మీటర్ల కిందికి వెళ్లిపోయాయి. పెదరుషికొండలో 22.84 మీటర్ల దిగువన నీరు లభిస్తోంది. ఇవి ఆందోళన కలిగించే పరిణామాలు.
విశాఖపట్నంలో నీటిఎద్దడి క్రమంగా పెరుగుతోంది. వర్షాకాలం వచ్చినా వానలు పడడం లేదు. వాతావరణ ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ ఏడాది వర్షాకాలం తరువాత భూగర్భ జలాలు పెద్దగా పెరిగే అవకాశం లేదు. బోర్ల ద్వారా అవసరమైన నీరు వస్తుందనేది అత్యాశే అవుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగరంలో కొత్త నిర్మాణాలకు తగినంత భూమి లేకపోవడంతో బిల్డర్లు శివారు ప్రాంతాలైన ఎండాడ, రుషికొండ, మధురవాడ, పీఎం పాలెం, తదితర ప్రాంతాల్లో భారీ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఈ జాబితాలో ఎండాడ అగ్రస్థానంలో ఉంది. అత్యధికులు ఎండాడ ప్రాంతంలో ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో అటు వైపు నివాసాలు పెరిగిపోయాయి. జీవీఎంసీ ఇచ్చే నీటిని తాగునీటికి ఉపయోగిస్తూ, ఇతర అవసరాలకు భూగర్భ జలాలను తోడేస్తుండడంతో ఆ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. సిటీలో అత్యంత నీటికరువు పరిస్థితి అక్కడే ఉంది.
ఎండాడ తరువాత మధురవాడలో భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. 27.06 మీటర్ల కిందికి వెళ్లిపోయాయి. ఇటీవల కాలంలో ఇక్కడ వందల సంఖ్యలో అపార్టుమెంట్లను నిర్మించేశారు. వాటికి జీవీఎంసీ నీటి సరఫరా లేదు. కొత్త కనెక్షన్లు కోరుతున్నా ఇవ్వలేకపోతున్నారు. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో చదరపు అడుగు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య లభిస్తుండడంతో అంతా అక్కడే ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. నీటి వసతి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. బిల్డర్లు అవసరాలకు సరిపడా నీటి సదుపాయం కల్పించడం లేదు. ఫ్లాట్లలోకి కుటుంబాలతో సహా వచ్చాక నీటి సమస్య అనుభవంలోకి వస్తోంది. దీనికి భయపడి కొంతమంది ఫ్లాట్లు కొనుక్కున్నా అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. అద్దెకు ఇచ్చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి, ఎడమ కాలువ ద్వారా నీరు విశాఖపట్నం వచ్చి, దాని నుంచి జీవీఎంసీ నీటి కనెక్షన్లు ఇచ్చేంతవరకు ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. మరోవైపు మధురవాడలో నీటి అవసరాలకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌తో రూ.725 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. దీని ద్వారా 37 వేల కనెక్షన్లు ఇస్తారు. ఈ పనులు పూర్తి కావడానికి కూడా కనీసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇవన్నీ పూర్తయ్యే వరకు మధురవాడలో నీటి సమస్య తప్పదు. పెద రుషికొండ, ఆరిలోవ, ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా, శివాజీపాలెం, గాజువాక కణితి కాలనీ, మారికవలస, అప్పుఘర్ ప్రాంతాల్లోను నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి.
గత ఏడాది జూన్ నెలలో భూగర్భ నీటి నిల్వలకు ఈ ఏడాది జూన్ నెల నీటి నిల్వలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఎండాడలో 11 మీటర్లు, మధురవాడలో 6 మీటర్లు, పెదరుషికొండలో 6 మీటర్లు, శివాజీపాలెంలో 8 మీటర్ల తేడా కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల్లో గత ఏడాది కాలంలో నీటి నిల్వల పరిస్థితి ఇలా ఉంది.
---------------------------------------------------------------------------
ప్రాంతం జూన్ 2025 జూన్ 2026
---------------------------------------------------------------------------
ఎండాడ 19.39 మీటర్లు 30.37 మీటర్లు
మధురవాడ 21.21 మీటర్లు 27.06 మీటర్లు
పెదరుషికొండ 16.89 మీటర్లు 22.84 మీటర్లు
ఆర్టీసీ కాంప్లెక్స్ 14.54 మీటర్లు 18.72 మీటర్లు
ఆరిలోవ 22.57 మీటర్లు 28.7 మీటర్లు
విశాలాక్షినగర్ 6.61 మీటర్లు 12.07 మీటర్లు
గోపాలపట్నం 1.31 మీటర్లు 9.33 మీటర్లు
పెందుర్తి 11.39 మీటర్లు 12.65 మీటర్లు
శివాజీపాలెం 6.94 మీటర్లు 14.01 మీటర్లు
-----------------------------------------------