Share News

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ABN , Publish Date - Apr 26 , 2026 | 01:42 AM

నగరంలో నీటి ఎద్దడి మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు మొరాయిస్తున్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎండాడ, పెదరుషికొండ, మధురవాడ, ఆరిలోవల్లో మరీ ఘోరం

20 మీటర్ల లోతుకు పడిపోయిన నీటిమట్టాలు

వర్షాలు పడకుంటే వచ్చే నెలలో కొరత మరింత తీవ్రం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో నీటి ఎద్దడి మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు మొరాయిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో బోర్లు వేసే యంత్రాలు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నాయి. జీవీఎంసీ అందించే నీరు అంతంత మాత్రంగానే ఉంది. ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. మే నెలలో ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కానుంది.

విశాఖపట్నం మొత్తం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. వర్షపునీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా ఖాళీ ప్రదేశాలన్నింటినీ కాంక్రీట్‌తో నింపేశారు. రహదారులపై ప్రవహించే నీరు భూమిలోకి వెళ్లడానికి వీల్లేకుండా మార్జిన్‌లలో ఫుట్‌పాత్‌లు నిర్మించి సిరామిక్‌ పలకలు వేసేశారు. దీంతో వర్షపు నీరు చాలావరకూ గెడ్డల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోతోంది. ఈ కారణంగా భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.

ఎండాడలో దారుణం

ఇటీవల ఎండాడలో జనాభా విపరీతంగా పెరిగింది. భారీ నిర్మాణాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు వచ్చేశాయి. అక్కడి అవసరాల కోసం పెద్ద పెద్ద బోర్లు వేయడంతో విపరీతంగా నీటిని వాడేస్తున్నారు. భూగర్భ జల వనరుల విభాగం గత ఏడాది (2025) ఏప్రిల్‌ నెలలో నీటి మట్టాలను పరిశీలిస్తే అక్కడ 19.62 (64 అడుగులు) మీటర్ల దిగువన నీరు కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి పరిశీలిస్తే ఆ నీళ్లు 28.71 (94 అడుగులు) కిందకు వెళ్లిపోయాయి. అంటే ఏడాది కాలంలో మరో 30 అడుగులు నీరు ఇంకిపోయింది. పెదరుషికొండలోను అదే పరిస్థితి. గత ఏడాది ఏప్రిల్‌లో అక్కడ 17.8 మీటర్లలో నీరు లభిస్తే ఈ ఏప్రిల్‌లో 22.69 మీటర్లకు పడిపోయింది.

మధురవాడలో మరీ ఘోరం

ఎండాడ ఖరీదైన ప్రాంతంగా మారడంతో మధురవాడ మధ్య తరగతి ప్రజల ఆవాసంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ లెక్కకు మించి అపార్టుమెంట్లను నిర్మించడం, ప్రతి అపార్ట్టుమెంట్‌కు రెండు అంతకు మించి బోర్లు వేయడంతో అక్కడ కూడా భూగర్భ జలాల వినియోగం బాగా పెరిగింది. అక్కడ అనేక ప్రాంతాలకు జీవీఎంసీ నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా బోర్లపైనే ఆధారపడుతున్నారు. గత ఏప్రిల్‌లో అక్కడ 17.21 మీటర్లలో నీరు పడగా, ఇప్పుడు 19.83 మీటర్లకు పడిపోయింది. పచ్చదనంతో కళకళలాడే ఆరిలోవలో కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. అక్కడ గత ఏప్రిల్‌లో 17.29 మీటర్ల దిగువన నీరు ఉండగా, ఇప్పుడు అది 19.06 మీటర్లకు దిగిపోయింది.

సింగిల్‌ డిజిట్‌లో నీరుంటే ఇబ్బంది లేదు

భూగర్భంలో నీటిని మీటర్లలో కొలిచినప్పుడు పది కంటే తక్కువగా నమోదైతే ఆ ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేదని అధికారులు అంటున్నారు. డబుల్‌ డిజిట్‌లో ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్టుగానే భావించాలి. భూగర్భ జల వనరుల విభాగం లెక్కల ప్రకారం నగరంపాలెం, బీహెచ్‌పీవీ, గొల్లలపాలెం, అగనంపూడి, స్టీల్‌ప్లాంటు, వెల్లంకి, నరవ, టి.దేవాడ, చిప్పాడ, పందలపాక, పాలవలస, చుక్కవానిపాలెం, విశాలాక్షి నగర్‌ ప్రాంతాల్లో నీటి వనరులు ఆశాజనకంగా ఉన్నాయి. చిప్పాడ, పాలవలస, చుక్కవానిపాలెంలలో కేవలం 1.6 మీటర్ల లోతులోనే నీరు లభించడం విశేషం. ఇక గాజువాక, పెందుర్తి, సీతమ్మధార, మారికవలస, అనంతవరం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో పది మీటర్ల కంటే దిగువన నీరు లభిస్తోంది.

ఇదీ పరిస్థితి

-----------------------------------------------

ప్రాంతం 2025 ఏప్రిల్‌ 25 2026 ఏప్రిల్‌ 26లో

నీటిలోతు నీటి లోతు

------------------------------------------------------

ఎండాడ 19.62 మీటర్లు 28.71 మీటర్లు

పెదరుషికొండ 17.8 మీటర్లు 22.69 మీటర్లు

మధురవాడ 17.21 మీటర్లు 19.83 మీటర్లు

ఆరిలోవ 17.79 మీటర్లు 19.06 మీటర్లు

శివాజీపాలెం 12.05 మీటర్లు 12.57 మీటర్లు

భీమిలి 8.06 మీటర్లు 7.12 మీటర్లు

శొంఠ్యాం 8.51 మీటర్లు 9.29 మీటర్లు

పాలవలస 1.14 మీటర్లు 1.14 మీటర్లు

చిప్పాడ 2.4 మీటర్లు 1.54 మీటర్లు

నరవ 1.42 మీటర్లు 3.28 మీటర్లు

స్టీల్‌ప్లాంటు 4.97 మీటర్లు 5.62 మీటర్లు

-------------------------------------------------------------------------------

Updated Date - Apr 26 , 2026 | 01:42 AM