విద్యార్థులను చితకబాదిన హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలు
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:03 PM
భోజనం బాగుండలేదన్నందుకు హెచ్‌ఎం విద్యార్థులను చితకబాదిన ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ శుక్రవారం విచారణ నిర్వహించారు.
గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ
విద్యార్థులు, హెచ్‌ఎంతో మాట్లాడిన డీడీ
విద్యార్థులను కొట్టిన విషయం వాస్తవమే
సీలేరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): భోజనం బాగుండలేదన్నందుకు హెచ్‌ఎం విద్యార్థులను చితకబాదిన ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ శుక్రవారం విచారణ నిర్వహించారు. జీకేవీధి మండలం ధారకొండ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విజయకుమార్, ప్రభుదాస్ అనే విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు హేమచంద్ర వద్దకు వెళ్లారు. సార్.. భోజనం రుచికరంగా వండడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన హెచ్‌ఎం వారిద్దరిని చితకబాదడంతో ఫిట్స్‌తో ఒకరు, శ్వాస అందక మరో విద్యార్థి విలవిలలాడుతూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు, విద్యా కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్‌కు, ఐటీడీఏ పీఓ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యా చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని పాడేరు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) పరిమళను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ధారకొండ ఆశ్రమ పాఠశాలలో డీడీ పరిమళ తొలుత విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత హెచ్‌ఎంను కూడా విచారించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థులను హెచ్‌ఎం కొట్టిన సంఘటన వాస్తవమేనని తమ విచారణలో వెల్లడైయిందన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన హెచ్‌ఎం హేమచంద్ర ను ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు నివేదికను కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు అందజేస్తామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాల్లో టెన్త్ పరీక్షలకు 5 వేల మంది
ఆశ్రమ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ తెలిపారు. శుక్రవారం సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ నిమిత్తం వచ్చిన ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలోనూ 100 రోజుల యాక్షన్ ఫ్లాన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతి రోజూ ఒక సబ్జెక్టుపై టెస్టు నిర్వహిస్తున్నామన్నారు. ఆ టెస్టుల్లో మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఈ సందర్శంగా సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు తీరుపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే టెస్టుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల జాబితాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులు, కిచెన్, స్టోర్, మరుగుదొడ్లను డీడీ పరిమళ పరిశీలించారు. ఈ సంద్భంగా విద్యార్థులతో సమావేశమై మెనూ సక్రమంగా పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థుల క్లాస్ రూమ్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ జయనాగలక్ష్మి, ఆశ్రమ పాఠశాల వార్డెన్ పి. నాగశకుంతల పాల్గొన్నారు.