విద్యార్థిగా మారిన డీఈవో
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:32 AM
జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు విద్యార్థిగా మారారు. శుక్రవారం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా చోడవరంలోని కొత్తూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి- మన పండుగ’ కార్యక్రమానికి ఆయన విద్యార్థి మాదిరిగా స్కూల్ యూనిఫామ్ ధరించి హాజరయ్యారు. బాలికలు, ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు.
పిల్లల యూనిఫామ్‌లో చోడవరం బాలికోన్నత పాఠశాల సందర్శన
విద్యార్థులతో కలిసి ప్రార్థన.. చాక్లెట్లు పంపిణీ
చోడవరం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు విద్యార్థిగా మారారు. శుక్రవారం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా చోడవరంలోని కొత్తూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి- మన పండుగ’ కార్యక్రమానికి ఆయన విద్యార్థి మాదిరిగా స్కూల్ యూనిఫామ్ ధరించి హాజరయ్యారు. బాలికలు, ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులకు చాక్లెట్లు, ఆపిల్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన వుంటుందని, అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. డీఈవో వెంట ప్రధానోపాధ్యాయుడు ఐవీ రామిరెడ్డి, ఎంఈవోలు, ఉపాధ్యాయులు వున్నారు.
ఘనంగా ’మన బడి- మన పండగ’
అనకాపల్లి, జూన్ 12 (ఆధ్రజ్యోతి): వేసవి సెలవులు పూర్తికావడంతో పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం అయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజు ‘మన బడి- మన పండుగ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలు, చాక్లెట్లతో స్వాగతం పలికారు. ‘మన బడి- మన పండుగ’ కార్యక్రమాలకు డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు హాజరై ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కాగా శని, ఆదివారాలు సెలవు కావడంతో పాఠశాలలు తెరిచిన తొలి రోజున కొంతమంది విద్యార్థులు హాజరుకాలేదు.
డీఈవోకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు స్కూల్ యూనిఫామ్ ధరించి పాఠశాలను సందర్శించడంపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఐక్యత, క్రమశిక్షణకు చిహ్నమైన యూనిఫామ్ ధరించి, విద్యార్థుల్లో తానూ ఒకరై అందరికీ ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు గారికి అభినందనలు. వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభమైన చోడవరం మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు యూనిఫామ్ ధరించిన డీఈవో, విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రార్థనలో పాల్గొని ప్రతిజ్ఞ చేయడం స్ఫూర్తిదాయకం’ అని పోస్టు చేశారు.