Share News

ఎట్టకేలకు డీఈవో పోస్టు భర్తీ

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:20 AM

ఎట్టకేలకు స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి పోస్టును అదనపు బాధ్యతలు ప్రాతిపదికన భర్తీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో సీనియర్‌ అధ్యాపకులకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎట్టకేలకు డీఈవో పోస్టు భర్తీ
పాడేరు డీఈవో కార్యాలయం

అదనపు బాధ్యతల ప్రాతిపదికన ఎన్‌.భానుమూర్తి నియామకం

జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఎక్కువగా ఇన్‌చార్జులతోనే కొనసాగింపు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఎట్టకేలకు స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి పోస్టును అదనపు బాధ్యతలు ప్రాతిపదికన భర్తీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో సీనియర్‌ అధ్యాపకులకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టేల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌, ట్రైనింగ్‌(ఎస్‌సీఈఆర్‌టీ)లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న ఎన్‌.భానుమూర్తికి స్థానిక డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఎస్‌సీఈఆర్‌టీలో, ఇక్కడ డీఈవోగా సైతం బాధ్యతలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాదికి జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు శాశ్వతంగా భర్తీ అయ్యే పరిస్థితి లేదని స్పష్టమవుతున్నది. ఇదే విషయాన్ని గత జూలై 19న ‘ఆంధ్రజ్యోతి’లో ‘డీఈవో పోస్టు భర్తీ లేనట్టేనా?’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. కాగా జిల్లాలో గత నాలుగేళ్లుగా పరిశీలిస్తే ఎక్కువగా ఇన్‌చార్జులతోనే డీఈవో పోస్టు కొనసాగడం గమనార్హం.

ఎక్కువ కాలంలో ఇన్‌చార్జిలతోనే డీఈవో పోస్టు

జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు ఎక్కువ కాలం ఇన్‌చార్జులతోనే కొనసాగడం విశేషం. గతంలో ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం, చింతూరు, పాడేరు రెవెన్యూ డివిజన్లలోని 22 మండలాలుండడంతో పాటు ఆయా ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దూరం కావడం, ప్రైవేటు విద్యాలయాలు సైతం లేకపోవడంతో స్థానిక డీఈవోగా పని చేసేందుకు ఆసక్తి చూపని పరిస్థితి కొనసాగుతున్నది. జిల్లా ఏర్పడిన 2022లో పి.రమేశ్‌ను డీఈవోగా నియమించారు. ఆయన ఏడాది పని చేసిన తర్వాత బదిలీ చేసి శ్యామూల్‌ అనే అఽధికారిని నియమిస్తే, ఆయన భాధ్యతలు స్వీకరించలేదు. దీంతో మరో అధికారి సలీమ్‌బాషాను నియమించారు. ఆయన సుమారుగా ఆరు నెలలు పని చేసిన తర్వాత బదిలీపై వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యాశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న బ్రహ్మాజీరావుకు డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన సుమారుగా ఏడాదిన్నర పని చేసి బదిలీ కావడంతో విజయనగరం డైట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రామకృష్ణారావుకు డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎనిమిది నెలలు విధులు నిర్వహించి, పని భారం కారణంగా డీఈవో బాధ్యతల నుంచి గత జూన్‌ నెలలో రిలీవ్‌ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో స్థానిక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళకు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఏజెన్సీలో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన రెండు వందలకు పైగా విద్యాలయాలు, 80 వేలకు పైబడి గిరిజన విద్యార్థుల ఆలనాపాలనతో టీడబ్ల్యూ డీడీకి విపరీతమైన పని భారం ఉంటుంది. ఈ తరుణంలో మరెవరికైనా డీఈవోగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం విద్యాశాఖలో వ్యక్తమైంది. ఈ క్రమంలో విజయవాడలోని ఎస్‌సీఈఆర్‌టీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సీనియర్‌ లెక్చరర్‌గా ఉన్న ఎన్‌.భానుమూర్తికి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ ఏడాదికి శాశ్వత డీఈవో నియామకం లేదని తేలిపోయింది.

Updated Date - Aug 04 , 2026 | 12:20 AM