దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:37 PM
తీవ్ర అల్పపీడనం అనంతరం మన్యంలో వాతావరణం మారింది. ఎండ ప్రభావం తగ్గుముఖం పట్టడడంతోపాటు ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురుస్తున్నది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
మన్యం వాతావరణంలో మార్పులు
పాడేరు, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): తీవ్ర అల్పపీడనం అనంతరం మన్యంలో వాతావరణం మారింది. ఎండ ప్రభావం తగ్గుముఖం పట్టడడంతోపాటు ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురుస్తున్నది. శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అనేక మండలాల్లో ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. వాస్తవానికి ప్రతి ఏడాది సెప్టెంబరు రెండో వారం నుంచే ఏజెన్సీలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చలి, పొగమంచు ఏర్పడేది. కాని ఈఏడాది ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. అయినప్పటికీ గత వారం రోజులు ఏజెన్సీ వ్యాప్తంగా శీతాకాల వాతావరణం ఏర్పడుతున్నది. దీంతో తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేయడంతోపాటు తర్వాత సైతం ఎండ ప్రభావం సైతం తగ్గుతున్నది. ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం కొయ్యూరులో 22.1 డిగ్రీలు, జి.మాడుగులలో 20.9, జీకేవీధిలో 20.8, పాడేరులో 20.3, చింతపల్లిలో 19.9, అరకులోయలో 19.6, ముంచంగిపుట్టులో 16.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో..
మన్యంలో ఉదయం, సాయంత్రం వేళలలో మంచు దట్టంగా కురుస్తున్నది. శుక్రవారం ఉదయం ఐదు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చింతపల్లి, లంబసింగి పరిసర ప్రాంతాల్లో మంచు దుప్పటి కమ్ముకుంది. దీంతో స్థానిక గిరిజనులు, పర్యాటకులు మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మంచు అధికంగా ఉండడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణం చేశారు.