కూరగాయలకు డిమాండ్
ABN , Publish Date - May 11 , 2026 | 12:44 AM
చాలా వారాల తరువాత కూరగాయలకు ఆశించిన ధరలు లభిస్తుండడంతో రైతులు ఆనందం చెందుతున్నారు. వేసవి కారణంగా కూరగాయల సాగు తక్కువగా వుండడం, మరోవైపు వివాహాది శుభకార్యాలు ఉండడంతో కూరగాయలకు గిరాకీ ఏర్పడింది. దేవరాపల్లిలోని కూరగాయల మార్కెట్‌కు ఆదివారం చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పలు రకాల కూరగాయలు తీసుకువచ్చి విక్రయించారు.
దేవరాపల్లి మార్కెట్‌లో పోటీపడి కొనుగోలు చేసిన వ్యాపారులు
గత వారంతో పోలిస్తే రెట్టింపు అయిన ధరలు
సాగుదారుల ఆనందం
దేవరాపల్లి, మే 10 (ఆంధ్రజ్యోతి): చాలా వారాల తరువాత కూరగాయలకు ఆశించిన ధరలు లభిస్తుండడంతో రైతులు ఆనందం చెందుతున్నారు. వేసవి కారణంగా కూరగాయల సాగు తక్కువగా వుండడం, మరోవైపు వివాహాది శుభకార్యాలు ఉండడంతో కూరగాయలకు గిరాకీ ఏర్పడింది. దేవరాపల్లిలోని కూరగాయల మార్కెట్‌కు ఆదివారం చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పలు రకాల కూరగాయలు తీసుకువచ్చి విక్రయించారు. పాడేరు, అనకాపల్లి, విశాఖపట్నంలో రిటైల్‌గా కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు అధిక సంఖ్యలో వచ్చారు. బీర, బెండ, వంకాయలను వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. సుమారు 12 కిలోల బరువు వున్న క్రేటు నల్లవంకాయలు రూ.600 పలికింది. ప్రస్తుతం వివాహాలు వుండడం, మెనూలో వంకా కూర తప్పనిసరిగా కావడంతో వ్యాపారులు ఎగబడి కొనుగోలు చేశారు. గత వారం ఇదే క్రేటు వంకాయలు రూ.300కు మించి వ్యాపారులు కొనుగోలు చేయలేదు. తెల్లవంకాయ క్రేటు (15 కిలోలు) రూ.400, బీరకాయలు క్రేటు (సుమారు 14 కిలోలు) రూ.800 పలికింది. బీరకాయలు గత వారంతో పోలిస్తే రూ.300 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బెండ కాయలు పది కిలోలు రూ.300 నుంచి రూ.400కు వ్యాపారులు కొనుగోలు చేశారు. గత వారం రూ.200-250 మాత్రమే ధర పలికింది. గోంగూర, తోటకూర, కొత్తిమిర కూడా ఎక్కువ ధరకు త్వరగా అమ్ముడుపోయింది.