Share News

ఏసీ బస్సులకు డిమాండ్‌

ABN , Publish Date - May 08 , 2026 | 01:29 AM

ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు సంబంధించిన ఏసీ బస్సులకు డిమాండ్‌ పెరిగింది.

ఏసీ బస్సులకు డిమాండ్‌

ఆర్టీసీ సర్వీస్‌లకు రెండు రోజుల ముందే రిజర్వేషన్‌ పూర్తి

ఏప్రిల్‌ 15కు ముందు 56 శాతం ఆక్యుపెన్సీ

ఇప్పుడు 80 శాతం..

ద్వారకా బస్‌స్టేషన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు సంబంధించిన ఏసీ బస్సులకు డిమాండ్‌ పెరిగింది. ఎండలు తీవ్రం కావడం, రాత్రి,పగలు ఉక్కపోత కొనసాగడంతో దూరప్రాంత ప్రయాణికులంతా ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. రీజియన్‌లో 32 ఏసీ బస్సులు (గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల, డాల్ఫిన్‌ క్రూయిజ్‌, అమరావతి, నైట్‌ రైడర్‌) ఉన్నాయి. ఇవి విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, తిరుపతి, భువనేశ్వర్‌, చెన్నై వంటి దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వేసవి ప్రారంభమైన తరువాత వీటికి డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ బస్సుల్లో సీట్లు ఇప్పుడు రెండు రోజుల ముందుగానే రిజర్వ్‌ అయిపోతున్నాయి. అప్పటికప్పుడు వచ్చిన ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ప్రత్యేక సర్వీస్‌లు ఆపరేట్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు అంటున్నారు.

ఎండలు ఎక్కువ కాకముందు అంటే ఏప్రిల్‌ 15 వరకూ ఏసీ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో 56 శాతం ఉండేది. ఇప్పుడు రేషియో 80 శాతం వరకు నమోదవుతుంది. వారాంతాల్లో 90 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఏసీ స్పెషల్స్‌ నడిపేందుకు సిద్ధం

బి.అప్పలనాయుడు, ఆర్‌ఎం, విశాఖ రీజియన్‌

రీజియన్‌లో గల 32 ఏసీ బస్సుల్లో సీట్లు రిజర్వేషన్‌ పూర్తయిన తరువాత స్పెషల్‌ సర్వీసులను ఆన్‌లైన్‌లో పెడుతున్నాం. ప్రస్తుతం ప్రతిరోజూ షెడ్యూల్‌ సర్వీసులకు అదనం ఒక ఏసీ స్పెషల్‌ నడుపుతున్నాం. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టు ఏసీ స్పెషల్‌ నడిపేందుకు ప్లాన్‌ చేసుకుంటాం.


ఏయూలో ఖాళీల భర్తీ

తొలి దశలో 246 పోస్టులు

232 రెగ్యులర్‌, మరో 14 బ్యాక్‌లాగ్‌...

ఈ మేరకు సన్నద్ధం కావాలని వర్సిటీ అధికారులకు సమాచారం అందించిన ప్రభుత్వం

విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుమారు 246 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఏయూలో రెండు దశాబ్దాలుగా ఖాళీలను భర్తీ చేయలేదు. దీంతో బోధన, పరిశోధనలపై తీవ్ర ప్రభావం పడుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీ ర్యాంకు దిగజారుతోంది. ఖాళీలను భర్తీ చేసేందుకు గతంలో పలుమార్లు ప్రభుత్వాలు యత్నించినప్పటికీ ముందుకుసాగలేదు. ఈ నేపథ్యంలో ఆ నోటిఫికేషన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ నూతన నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు వర్సిటీ అధికారులకు సమాచారాన్ని అందించింది. ఏయూలో ఖాళీలను చివరిసారిగా 2006లో భర్తీచేశారు.

భారీగా ఖాళీలతో ఇబ్బంది

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంజూరైన పోస్టులు 936 ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని పోస్టులను ర్యాటిఫికేషన్‌ కమిటీ తగ్గించిందని, ప్రస్తుతం 726 పోస్టులు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్సిటీలో 193 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగిలిన ఖాళీలను దఫదఫాలుగా ప్రభుత్వం భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి దశలో 232 రెగ్యులర్‌, మరో 14 బ్యాక్‌లాగ్‌ కలిపి మొత్తం 246 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో విభాగాల వారీగా ఉన్న ఖాళీలు, ఇతర వివరాలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Updated Date - May 08 , 2026 | 01:29 AM