Share News

నియోజకవర్గాల పునర్విభజన

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:05 AM

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది.

నియోజకవర్గాల పునర్విభజన

పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం

ప్రస్తుతం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు...అవి 22 లేదా 23కి పెరిగే ఛాన్స్‌

విశాఖ జిల్లాలో 9 లేదా 10 అసెంబ్లీ సెగ్మెంట్లు?

భీమిలి, గాజువాక నియోజకవర్గాల విభజన తప్పనిసరి

అదనంగా మరో ఎంపీ స్థానం కూడా ఏర్పాటయ్యే అవకాశం...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. గత ఏప్రిల్‌లో బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనిపై బిల్లు ప్రతిపాదించి భంగపడింది. ఇప్పుడు లోపాలన్నీ సవరించి సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాలపు సమావేశాల్లో పక్కాగా బిల్లు పెడుతోంది. మొత్తంగా 50 శాతం సీట్లు పెంచాలనేది ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోకసభ స్థానాలు ఉండగా వాటిని 38కి పెంచుతారని అంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం ఒక లోక్‌సభ స్థానం ఉండగా అదనంగా మరొకటి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిని ఇప్పుడు 22 లేదా 23కి పెంచుతారని ప్రచారం జరుగుతోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే పది అవుతాయని అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కల ప్రకారం విశాఖ జిల్లా జనాభా 20 లక్షలు. అయితే రెండేళ్ల క్రితం (2024) జరిగిన సాధారణ ఎన్నికల లెక్కల ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 20,22,350. వారిలో పురుషులు 9,97,078. మహిళలు 10,25,151. ట్రాన్స్‌జెండర్లు మరో 121 మంది ఉన్నారు. ప్రతి రెండు లక్షల మంది ఓటర్లకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం అనుకుంటే జిల్లాలో పది నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, గాజువాక...ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. పెందుర్తి నియోజకవర్గం రెండు జిల్లాల్లో పరిధిలో ఉంది.

- భీమిలి నియోజకవర్గం ఓటర్లపరంగా, విస్తీర్ణం పరంగాను పెద్దది. ఇక్కడ 3,66,561 మంది ఓటర్లు ఉన్నారు. విశాఖపట్నం సిటీని ఆనుకుని ఉన్న మధురవాడ, పీఎం పాలెం, ఎండాడ పరిసర ప్రాంతాలను కలుపుకొని మూడు లక్షల జనాభా ఉన్నారు. భీమిలిని రెండుగా విభజించి మధురవాడ పేరుతో ఒక నియోజకవర్గం, భీమిలి పేరుతో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో మరో నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

- గాజువాక నియోజకవర్గంలో ఓటర్లు 3,35,536 మంది. దీనిని కూడా రెండుగా విభజించాల్సి ఉంది. అక్కడ దువ్వాడ, కూర్మన్నపాలెం ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. జనాభా పెరుగుతోంది. గాజువాక నుంచి ఆ రెండింటినీ విడదీసి దువ్వాడ/కూర్మన్నపాలెం పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. దీనికి మరికొంత జనాభా అవసరం అనుకుంటే పశ్చిమ నియోజకవర్గంలోని సింధియా ప్రాంతాన్ని జత చేసుకోవచ్చు.

- విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు 2,92,450. దీనిని కూడా రెండుగా చేయాల్సిన అవసరం ఉంది. ఆరిలోవ ప్రాంతంలో ఓటర్ల సంఖ్య అధికం. హనుమంతవాక, ఆరిలోవ, పైనాపిల్‌ కాలనీ, కృష్ణాపురం, అవసరమైతే విశాలాక్షి నగర్‌ కలుపుకొని ఆరిలోవ/హనుమంతవాక పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటుచేస్తారు. మిగిలిన ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌, పెదజాలరిపేట, మద్దిలపాలెం ప్రాంతాలన్నీ కలిసి తూర్పు నియోజకవర్గం కిందనే ఉంటాయి.

- ఉత్తర నియోజకవర్గంలో ఓటర్లు 2,84,638. గాజువాకను రెండుగా చేసినప్పుడు విశాఖ పశ్చిమ నుంచి సింధియా వంటి ప్రాంతాలను అటు కలిపితే, ఉత్తరంలో కొంత భాగాన్ని ‘వెస్ట్‌’లో కలపవచ్చు.

- పెందుర్తి నియోజకవర్గం ప్రస్తుతం గందరగోళంగా ఉంది. పెందుర్తి మండలం మాత్రం విశాఖ జిల్లాలో ఉండి, అందులోని మిగిలిన రెండు మండలాలు పరవాడ, సబ్బవరం అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు పెందుర్తి మండలాన్ని, పక్కనే ఉన్న కొన్ని జీవీఎంసీ వార్డులను కలిసి పెందుర్తి నియోజకవర్గంగా విశాఖలో ఉంచి, పరవాడ, సబ్బవరం మండలాలకు అదనంగా కొన్ని ప్రాంతాలు కలిపి పరవాడ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయవచ్చు.

- దక్షిణ నియోజకవర్గం ఓటర్లు 2,17,784. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు అవసరమైన సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఇందులో కొన్ని ప్రాంతాలను అటు ఉత్తర నియోజకవర్గంలో కాని, అటు తూర్పులో కానీ జత చేసుకోవచ్చు.


రెండుగా విశాఖ లోక్‌సభ స్థానం

విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రస్తుతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెందుర్తిని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో చేర్చి, విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటను విశాఖ పరిధిలో ఉంచారు. ఎస్‌.కోటను విజయనగరం జిల్లాలోనే ఉంచాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ఇప్పుడు కొత్తగా భీమిలి నుంచి ఒకటి, తూర్పు నుంచి ఒకటి, పెందుర్తి పూర్తిగా విశాఖ జిల్లాలో ఉంటుందని అనుకుంటే లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు అవుతాయి. అప్పుడు అదనంగా మరొక కొత్త లోక్‌సభ స్థానం పెట్టాల్సి వస్తుంది. అందులో ఏయే నియోజకవర్గాలు ఉంచుతారు?, కొత్త పేరు ఏమి పెడతారనేది చూడాలి.

Updated Date - Nov 29 , 2026 | 01:05 AM