పంచాయతీలకు ప్రత్యేకాధికారులపై కసరత్తు
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:36 AM
సర్పంచుల పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనున్నది.
2తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం
పెందుర్తి మండలానికి సంబంధించి జనసేన, టీడీపీ వర్గాల నుంచి వేర్వేరుగా జాబితాలు
విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):
సర్పంచుల పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించడానికి పంచాయతీ అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా కలెక్టర్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో మూడు నుంచి నాలుగు పంచాయతీలకు ఒక అధికారిని నియమించేలా ఆయా అధికారులు ప్రతిపాదనలు పంపారు. భీమిలి నియోజకవర్గం వరకు ఎటువంటి ఇబ్బందిలేదు. అయితే పెందుర్తి మండలంలో ప్రత్యేకాధికారుల నియామకంలో ప్రతిష్టంభన నెలకొంది. జనసేన, టీడీపీ వర్గాలు పంచాయతీలకు వేర్వేరుగా ప్రత్యేకాధికారుల జాబితా ఇచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై పంచాయతీ అధికారులు ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. డిప్యూటీ ఎంపీడీవో క్యాడర్ అధికారి ఒకరు తాను కోరుకున్న నాలుగు పంచాయతీలకు ప్రత్యేకాధికారిగా నియమించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒక ప్రజా ప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకునిగా గత నెలలో నియమితులైన సదరు అధికారి, ఇప్పుడు ఆ పోస్టుతోపాటు నాలుగు పంచాయతీలకు ప్రత్యేకాధికారిగా నియమించాలని పట్టుబడుతున్నారు. పెందుర్తి మండలంలో పంచాయతీలకు ఎవరెవరిని ప్రత్యేకాధికారులగా నియమించాలన్న దానిపై జిల్లా పంచాయతీ అధికారులకు ఎంపీడీవో ప్రతిపాదించిన జాబితాలో సదరు అధికారి పేరు చేర్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.