Share News

డీఆర్‌వో నియామకంపై తర్జన భర్జన

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:24 PM

జిల్లా రెవెన్యూ అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రస్తుతం తర్జన భర్జన నెలకొంది.

డీఆర్‌వో నియామకంపై తర్జన భర్జన
కలెక్టరేట్‌లోని డీఆర్‌వో కార్యాలయం

ప్రస్తుతం జిల్లాలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి లేకపోవడమే కారణం

గతంలో ఇద్దరు మహిళా అధికారులను డీఆర్‌వోగా నియమిస్తే చేరని వైనం

పాడేరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రస్తుతం తర్జన భర్జన నెలకొంది. ఇన్నాళ్లూ జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేసిన ఎంవీఎస్‌.లోకేశ్వరరావు రూ.50 వేలు లంచం తీసుకున్న కేసులో బుధవారం అరెస్టు అయిన సంగతి తెలిసింది. దీంతో ప్రస్తుతం డీఆర్‌వోగా ఎవర్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనేది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వాస్తవానికి గతంలో అంటే ఈ ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలుగా ఇద్దరు మహిళా అధికారులను ఇక్కడ డీఆర్‌వోగా నియమించింది. అయితే అప్పటికే డీఆర్‌వోగా పాతుకుపోయిన లోకేశ్వరరావు వారిద్దరూ ఇక్కడ విధుల్లో చేరకుండా తెరచాటు ప్రయత్నాలు సాగించి సఫలమయ్యారు. దీంతో ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ సాహించలేకపోయారు. ఇదే అదనుగా ఆయనే డీఆర్‌వోగా కొనసాగారు. కాగా ఆయన కంటే ముందు కలెక్టరేట్‌లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసిన ఒక అధికారి ఇన్‌చార్జి డీఆర్‌వోగా బాధ్యతలు నిర్వహించేవారు. అయితే లోకేశ్వరరావు చతురతతో ఆయన్ని తప్పించి, గత కలెక్టర్‌ ఉన్న సమయంలోనే డీఆర్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సదరు అధికారి తనకు పోటీ రాకుండా ప్రస్తుతం ఉన్న కలెక్టర్‌ సహకారంతో ఆయనను సరెండర్‌ చేశారని అధికారులు అంటున్నారు. దీంతో ఆయనకు ఏ అడ్డూ లేకుండా డీఆర్‌వో స్థాయిలో కలెక్టరేట్‌ను ఏకచక్రాధిపత్యంగా వ్యవహరించారని సిబ్బంది అంటున్నారు. ఆయన ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న డీఆర్‌వో పోస్టును అప్పగించే ఆ స్థాయి అధికారి లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచే ఆ స్థాయి అధికారిని స్థానిక డీఆర్‌వోగా నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated Date - Sep 24 , 2026 | 11:24 PM