Share News

ఆలస్యంగా వరినాట్లు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:48 AM

తీవ్రవాయుగుండం ప్రభావంతో గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పలువురు రైతులు పొలాలను దమ్ముపట్టి, వరినాట్లు వేస్తున్నారని, అయితే ముదురు నారును నాటే రైతులు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ కె.వి.రమణమూర్తి తెలిపారు. ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా రైతులకు పలు సూచనలు అందించారు. ఆయా వివరాలు ఆయన మాటల్లోనే..

ఆలస్యంగా వరినాట్లు
కోటవురట్ల మండలం లింగాపురంలో వరి నారు చివర్లు తుంచి నాట్లు వేయాలని కూలీలకు సూచిస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది

నారు ముదిరితే మెలకులు పాటించాలి

చివర్లు తుంచి వేసి.. కుదురుకు 6-8 మొక్కలు నాటుకోవాలి

కుదుళ్ల మధ్య దూరం తగ్గించాలి

ఆర్‌ఏఆర్‌ఎస్‌ సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ రమణమూర్తి

అనకాపల్లి అగ్రికల్చర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తీవ్రవాయుగుండం ప్రభావంతో గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పలువురు రైతులు పొలాలను దమ్ముపట్టి, వరినాట్లు వేస్తున్నారని, అయితే ముదురు నారును నాటే రైతులు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ కె.వి.రమణమూర్తి తెలిపారు. ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా రైతులకు పలు సూచనలు అందించారు. ఆయా వివరాలు ఆయన మాటల్లోనే..

వాస్తవంగా జిల్లాలో సెప్టెంబరు రెండో వారంలోగా వరినాట్లు పూర్తవుతాయి. కానీ ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చాలా మంది రైతులు కనీసం వరినారుమళ్లు కూడా పోయలేదు. కొంతమంది రైతులు ఆగస్టు మొదటి పక్షంలో కురిసిన మోస్తరు వర్షాలకు వరినారుమళ్లుపోశారు. తరువాత వర్షాలు అంతగా పడకపోవడంతో ట్యాంకర్లతో నీటిని తెచ్చి నారును కాపాడుకున్నారు. మరికొందరు సమీపంలోని వ్యవసాయ బోర్లు నుంచి ట్యూబులు వేసుకొని వరినారును బతికించుకున్నారు. తరువాత పొలాలను దమ్ముచేయడానికి సరిపడ వర్షాలు పడకపోవడంతో నారు అందుబాటులోకి వచ్చినప్పటికీ నాట్లు వేయలేకపోయారు. తరువాత గత నెల చివరి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్రవాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసి పొలాల్లో నీరు నిలిచింది. చెరువుల్లో సైతం నీరు చేరింది. అయితే చాలాచోట్ల వరినారు ముదిరిపోయింది. అయినప్పటికీ నాలుగైదు రోజుల నుంచి పొలాలను దమ్ము చేసి, వరినాట్లు వేస్తున్నారు. నెలరోజులకు మించిన వరి నారును పొలంలో నాటేటప్పుడు రైతులు కొన్ని మెలకువలు పాటించాలి. ముదిరిన నారు చివర్లు తుంచి వేసి, ప్రతి కుదురుకు ఆరు నుంచి ఎనిమిది మొక్కలు ఉండేలా నాటుకోవాలి. ముదురు నారుతో ఆలస్యంగా వరినాట్లు వేయడం వల్ల పిలకలు తక్కువగా వస్తాయి. అందువల్లనాటిన మొక్కల నుంచే వెన్నులు వచ్చేలా ఎక్కువ మొక్కలను నాటాలి. నారును మరీలోతుగా కాకుండా మోస్తరు లోతులో నాటుకోవాలి. కుదుళ్ల మధ్య దూరం తగ్గించి, దగ్గర దగ్గరగా నాటుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. పిలకలు త్వరగా రావడానికి సిఫారసు చేసిన నత్రజని ఎరువులో 50 నుంచి 70 శాతం నాటినప్పుడే వేసి, మిగతా ఎరువును అంకుర దశలో వేసుకోవాలి.

దిగుబడులు తగ్గొచ్చు..

జిల్లాలో పలువురు రైతులు సుమారు నెల రోజులు ఆలస్యంగా వరినాట్లు వేస్తున్నారు. దీనివల్ల ధాన్యం దిగుబడి కొంతమేర తగ్గే అవకాశం వుంది. సెప్టెంబరు చివరి వాంర తరువాత వరినాట్లు వేసిన పొలాల్లో పైరు పూత దశకు వచ్చేసరికి చలి ప్రారంభం అవుతుంది. దీనివల్ల దిగుబడులు సగం మేర తగ్గిపోతాయి. అంతేకాక తెగుళ్ల బెడద అధికంగా వుంటుంది. అగ్గితెగులు, కాండం తొలిచే పురుగు వంటివి ఆశిస్తాయి. అక్టోబరుతోపాటు నవంబరులో కూడా సాగునీరు సమృద్ధిగా అందుబాటులో వుండేటట్టయితే వరి పంటకన్నా అపరాలు, చిరుధాన్యాలు వంటి ఆరుతడి పంటలు పండించుకోవడం మేలు.

Updated Date - Oct 02 , 2026 | 12:48 AM