Share News

కలప వేలంపై కాలయాపన

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:43 PM

అటవీ శాఖ అధికారుల తీరు వల్ల రూ.2 కోట్ల విలువైన మారుజాతి కలపకు చెదలు పడుతోంది. కాకరపాడు కలప డిపోలో నిల్వ ఉన్న కలపకు ఎక్కువ ధర నిర్ణయించి వేలం పాటలు నిర్వహించడం, వ్యాపారులు ముందుకు రాకపోవడంతో మూడేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసి కలపకు చెదలు పడుతోంది.

కలప వేలంపై కాలయాపన
కాకరపాడు కలప డిపోలో నిల్వ ఉన్న మారుజాతి కలప దుంగలు

చింతాలమ్మ, రొంపుల ఘాట్‌లలో తొలగించిన కలప కాకరపాడు డిపోలో నిల్వ

అడుగు రూ.500 నుంచి రూ.550 మధ్య ధర నిర్ణయించిన అటవీ అధికారులు

ధర ఎక్కువగా ఉండడంతో ముందుకురాని వ్యాపారులు

మూడేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడుస్తున్న సరుకు

పరిస్థితి వివరిస్తూ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి చింతపల్లి డీఎఫ్‌వో లేఖలు

అనుమతులు రాకపోవడంతో రూ.2 కోట్ల విలువైన కలపకు చెదలు

కొయ్యూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ అధికారుల తీరు వల్ల రూ.2 కోట్ల విలువైన మారుజాతి కలపకు చెదలు పడుతోంది. కాకరపాడు కలప డిపోలో నిల్వ ఉన్న కలపకు ఎక్కువ ధర నిర్ణయించి వేలం పాటలు నిర్వహించడం, వ్యాపారులు ముందుకు రాకపోవడంతో మూడేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసి కలపకు చెదలు పడుతోంది.

జాతీయ రహదారి నిర్మాణ సమయంలో చింతాలమ్మ ఘాట్‌, రొంపుల ఘాట్‌లో గుంపెన, తంగేడు, పచారీ, బెన్నంగి, సిరిమాను(తెల్లకర్ర), గన్నర, బండారు వంటి మారుజాతి కలప చెట్లను తొలగించారు. సుమారు 1500 క్యూబిక్‌ మీటర్ల కలపను 2023 జూన్‌ నుంచి నవంబరు వరకు కాకరపాడు(చీడిపాలెం కూడలి దరి ఐటీడీఏ కాలనీ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన) వెదురునగరం అటవీ కలప డిపోనకు తరలించి జాతుల వారీగా నిల్వ చేశారు. ఈ కలప సుమారు రూ.2 కోట్ల విలువ ఉంటుంది. అటవీ అధికారులు ఈ కలప అడుగు రూ.500 నుంచి రూ.550 మధ్యలో ధర నిర్ణయించి ఇప్పటి వరకు సుమారుగా 50 వేలం పాటలు నిర్వహించారు. అయితే ఈ ధర ఎక్కువగా ఉండడంతో ప్రైవేటు కలప డిపోల యజమానులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అటవీ అధికారులు నిర్ణయించిన ధరకు, డిపోల యజమానులు కోరుతున్న ధరకు అడుగుకు రూ.250లు తేడా ఉండడమే కారణం. మూడేళ్లుగా డిపోలో నిల్వ ఉండిపోవడంతో వర్షాలకు తడిసి, ఎండలకు ఎండి కలపకు చెదలు పట్టి పాడై మట్టిలో కలిసిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వ్యాపారులు కూడా కాస్త ముందుకు వచ్చి అడుగు రూ.300 నుంచి రూ.400కు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ చింతపల్లి డీఎఫ్‌వోకు పది శాతం వరకు ధర తగ్గించే అధికారం ఉంది. అంతకన్నా ఎక్కువ తగ్గించాలంటే అటవీశాఖ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి లేఖల ద్వారా తెలియజేసి అనుమతి పొందాలి. ఈ విషయమై డీఎఫ్‌వో సంవత్సరం క్రితమే అటవీశాఖ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయితే ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. దీంతో రూ.2 కోట్ల విలువైన కలప మట్టి పాలవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కలప అమ్మకాలకు నిర్దేశించిన ధర విషయమై పునరాలోచన చేసి వేలం పాటలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై చింతపల్లి డీఎఫ్‌వో వైవీ నర్సింగరావును వివరణ కోరగా కలప పాడైపోతున్నదని పీసీసీఎఫ్‌కు లేఖ రాశామన్నారు. వ్యాపారులు తగ్గించమన్నంత ధర తగ్గించే అవకాశం లేకపోయినా కొంత వరకు తగ్గించే అవకాశం ఉందన్నారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని, ఈ విషయమై మరోసారి లేఖ రాసి వీలైనంతలో వేలంపాటలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Updated Date - Mar 11 , 2026 | 11:43 PM