Share News

రైల్వే జోన్‌కు ఉద్యోగుల రాకలో జాప్యం

ABN , Publish Date - May 16 , 2026 | 12:48 AM

విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అవసరమైన సిబ్బందిని పంపడంలో ఇతర జోన్ల అధికారులు తాత్సారం చేస్తున్నారు.

రైల్వే జోన్‌కు ఉద్యోగుల రాకలో జాప్యం

ఇలాగైతే ఒకటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించేదెలా?

ఇతర జోన్ల జీఎంలకు రైల్వే బోర్డు డీజీ ఘాటు లేఖ

ఎన్‌ఓసీ ఇచ్చినా రిలీవ్‌ చేయరా?

దక్షిణ కోస్తా జోన్‌కు రావడానికి అప్రూవల్‌ పొందినది 526 మంది...

329 మందికి ఎన్‌ఓసీ

ఇప్పటివరకూ రిలీవ్‌ అయినది 183 మంది...

విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అవసరమైన సిబ్బందిని పంపడంలో ఇతర జోన్ల అధికారులు తాత్సారం చేస్తున్నారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి కొత్త జోన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. అయితే ఆయన చేసిన ప్రకటనకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు. దీంతో రైల్వే బోర్డు డైరెక్టర్‌ జనరల్‌ తీవ్రంగా స్పందిస్తూ అన్ని రైల్వే జోన్ల జనరల్‌ మేనేజర్లకు ఘాటుగా లేఖ రాశారు. విశాఖపట్నం జోన్‌తో పాటు కొత్తగా ఏర్పాటుచేసిన రాయగడ డివిజన్‌లో పనిచేస్తామని వివిధ జోన్ల నుంచి పలువురు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ ఎన్‌ఓసీలు ఇప్పటికే ఇచ్చామని, అయితే వారిని రిలీవ్‌ చేయకుండా జాప్యం చేయడమేమిటని ఆయన లేఖలో అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇచ్చిన ఎన్‌ఓసీలకు, రిలీవ్‌ చేసిన ఉద్యోగుల సంఖ్యకు అసలు పొంతన లేదని, ఇలాగైతే కొత్త జోన్‌ ఆపరేషన్‌ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఎన్‌ఓసీలు సమర్పించిన ఉద్యోగులను రిలీవ్‌ చేయాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా జోన్‌కు 526 మంది, రాయగడ డివిజన్‌కు 191 మంది వెళ్లడానికి అప్రూవల్‌ పొందగా, వారిలో దక్షిణ కోస్తా జోన్‌కు రావడానికి 329 మందికి ఎన్‌ఓసీలు ఇచ్చారు. వారిలో ఈ నెల 11వ తేదీ నాటికి జోన్‌ కోసం 183 మందిని, డివిజన్‌ కోసం 47 మందిని మాత్రమే అక్కడి అధికారులు రిలీవ్‌ చేశారు. ఈ ప్రక్రియ ఇంత నెమ్మదిగా సాగితే ఇంకో పదిహేను రోజుల్లో కొత్త జోన్‌, డివిజన్‌ ఆపరేషన్‌ ఎలా సాధ్యమవుతుందని ఆయన జోన్ల జనరల్‌ మేనేజర్లను ప్రశ్నించారు. తక్షణమే వారిని రిలీవ్‌ చేయాలని ఆదేశించారు.

ఒకేసారి అంతమంది వస్తే ఎలా...

విశాఖలో కొత్త జోన్‌కు సుమారు 1,500 నుంచి 2,000 మంది ఉద్యోగులు అవసరం. వారంతా వివిధ ప్రాంతాల నుంచి ఒకేసారి ఇక్కడికి వస్తే వారికి పోస్టుల కేటాయింపు, వసతి కల్పించడం కష్టమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్‌ తేదీ ప్రకటించిన నెల రోజుల్లోనే అన్నీ జరిగిపోవాలని అంటున్నారని, దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఇది దశల వారీగా జరగాల్సిన వ్యవహారమని, అందుకే కాసింత ఆలస్యమవుతున్నదని అంటున్నారు. ఒకేసారి వందలాది మంది వస్తే ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఉందని, అందుకే సమయం తీసుకుంటున్నారని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ లేఖ వచ్చినా ఇక్కడి పర్సనల్‌ విభాగమే చూడాలని, ఇది సంధికాలమని, ఒత్తిడి పెడితే సమస్యలు ఎక్కువ అవుతాయని, కాసింత సమయం ఇస్తే అన్నీ సక్రమంగా చేస్తామని అంటున్నారు.

Updated Date - May 16 , 2026 | 12:48 AM