Share News

మహిళా హాస్టళ్ల నిర్మాణంలో జాప్యం

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:54 AM

జిల్లాలో మహిళల వసతి గృహాల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన నిధులు సకాలంలో వాడకపోతే మురిగిపోయే ప్రమాదం ఉంది.

మహిళా హాస్టళ్ల నిర్మాణంలో జాప్యం

మూడు ప్రాంతాల్లో ఏర్పాటుకు రూ.172 కోట్లు మంజూరు

తొలి విడతలో రూ.113 కోట్లు

మార్చిలోగా రెండో విడత రూ.59 కోట్లు

పనుల్లో ప్రగతి ఉంటేనే నిధులు విడుదల

వినియోగించుకోకపోతే మురిగిపోయే ప్రమాదం

సమీక్షలో జిల్లా అధికారులను హెచ్చరించిన సీఎం చంద్రబాబునాయుడు

శివశక్తినగర్‌లో హడావిడిగా శంకుస్థాపన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మహిళల వసతి గృహాల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన నిధులు సకాలంలో వాడకపోతే మురిగిపోయే ప్రమాదం ఉంది. జిల్లా కలెక్టర్లతో సోమవారం అమరావతి నుంచి సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాకు మంజూరైన మూడు హాస్టళ్లలో ఒక దానికి అధికారులు స్థానిక ఎమ్మెల్యే చేతులు మీదుగా మంగళవారం హడావిడిగా శంకుస్థాపన చేయించడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పథకం కింద జిల్లాలో మూడు వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టళ్ల నిర్మాణానికి గత ఏడాది మే నెలలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ చొరవతో ఇవి మంజూరయ్యాయి. వీటిని రూ.172 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని ప్రకటించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతలను గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌కు అప్పగించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో పైనాపిల్‌ కాలనీ వద్ద ఒకటి, భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో మరొకటి, గాజువాక నియోజకవర్గంలో వడ్లపూడి వద్ద ఇంకొకటి నిర్మించాలని నిర్ణయించారు. వీటి కోసం తొలి దశలో రూ.113 కోట్లు మంజూరయ్యాయి. రెండో విడతగా మరో రూ.59 కోట్లు 2026 మార్చిలోగా తీసుకోవలసి ఉంది. మొదటి విడత పనుల ప్రగతి చూపిస్తేనే రెండో విడత నిధులు వస్తాయి. అయితే జిల్లా అధికారులు తగిన శ్రద్ధ తీసుకోకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. పైనాపిల్‌ కాలనీలో వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టల్‌ నిర్మాణానికి రెండు నెలల క్రితం అంటే డిసెంబరులో ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కలిసి శంకుస్థాపన చేశారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.90.54 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల నిర్మాణం చేస్తున్నారు. అందులో 204 గదులు నిర్మించి, 616 మందికి వసతి కల్పించాలనేది ప్రణాళిక. ప్రస్తుతం ఇక్కడ పునాదుల నిర్మాణం జరుగుతోంది.

భీమిలి నియోజకవర్గంలోని శివశక్తినగర్‌లో ఈ హాస్టల్‌ నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 1.46 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనున్నారు. దీనిని 18 నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు. నిర్మాణ వ్యయం రూ.26.12 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం దీనికి రూ.51.08 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. వాస్తవానికి ఇందులో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఉండడంతో శంకుస్థాపన కార్యక్రమంలో విశాఖ ఎంపీ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా అదే విషయం జీవీఎంసీ అధికారులకు చెబితే...ఎంపీ అందుబాటులో లేరని, ఆయనకు తాము చెప్పుకుంటామని అంటూ మంగళవారం హడావిడిగా శంకుస్థాపన చేయడం విశేషం.

గాజువాక నియోజకవర్గంలో 87వ వార్డు వడ్లపూడిలో అగ్నిమాపక కేంద్రం సమీపాన విమెన్స్‌ హాస్టల్‌ నిర్మాణానికి గత ఏడాది నవంబరు 24న ఎంపీ శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కలిపి శంకుస్థాపన చేశారు. ఆ పనులు కూడా నెమ్మదిగానే నడుస్తున్నాయి. దీనికి రూ.30.38 కోట్లు మంజూరుచేశారు.

పనులు జరిగింది పది శాతమే

గతంలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాల్లో సగటును పనులు పది శాతమే జరిగాయని అధికారులు చెబుతున్నారు. తొలి విడతగా ఇచ్చిన రూ.113 కోట్లలో ఇప్పటివరకూ రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాల్సి ఉంది.


స్టడీ సెంటర్ల సిబ్బంది వెనక్కి..

ఏయూ దూర విద్య కేంద్రం నిర్ణయం

రాష్ట్రంలో ఎనిమిది సెంటర్లు...

ఆయా కేంద్రాల్లో పని లేనందున క్యాంపస్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):

స్టడీ సెంటర్లలో ఉన్న సిబ్బందిని వెనక్కి రావాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, ఒంగోలులో స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒకరిద్దరు సిబ్బంది (సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌ హోదా) ఉండేవారు. అయితే, ఆయా సెంటర్లలో తగిన పని లేకపోవడంతో వారంతా ఖాళీగా ఉంటున్నారని అధికారులు భావించారు. అందుకే వెనక్కి రావాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్టడీ సెంటర్లలో పనిచేస్తున్న మొత్తం 16 మందిని మెయిన్‌ క్యాంపస్‌కు అటాచ్‌ చేశారు. వారి సేవలను ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించారు. అయితే, తాజా నిర్ణయంపై దూర విద్యకు సంబంధించిన విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్టడీ సెంటర్లను ఎత్తేసే ప్రక్రియలో భాగంగానే సిబ్బందిని వెనక్కి తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ అప్పలనాయుడు స్పందిస్తూ స్టడీ సెంటర్లు యథావిధిగా కొనసాగుతాయని, అవసరమైన సందర్భాల్లో సిబ్బందిని పంపిస్తామని చెప్పారు. ఏడాదిలో కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడ సిబ్బందికి పని ఉంటోందని, మిగిలిన సందర్భాల్లో ఖాళీగా ఉండడం వల్లే వెనక్కి రప్పించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ స్టడీ సెంటర్ల ద్వారా అడ్మిషన్స్‌కు సంబంధించిన అప్లికేషన్స్‌ ఇవ్వడం, స్టడీ మెటీరియల్‌ పంపిణీ వంటివి అక్కడ సిబ్బంది చేసేవారు. ప్రస్తుతం అడ్మిషన్స్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతోందని, స్టడీ మెటీరియల్‌ కూడా పోస్టు ద్వారా పంపిణీ చేస్తున్నామని, కాబట్టి విద్యార్థులకు ఇబ్బందులు ఉండబోవని ఆయన వెల్లడించారు.

Updated Date - Feb 11 , 2026 | 12:54 AM