కారవాన్ల రాక ఆలస్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:31 AM
పర్యాటకులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న కారవాన్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వాటి కోసం ముందుగా కారవాన్ పార్కులు నిర్మించి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఆ పార్కుల కోసం బుధవారం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. వాటికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, వారికి పనులు అప్పగించి, అవి పూర్తయిన తరువాత తాపీగా కారవాన్లు విశాఖపట్నం వస్తాయి. అంతవరకు వేచి ఉండక తప్పదు.
డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు,
చింతపల్లి మండలాల్లో కారవాన్ల పార్కులు
ఆసక్తి కలిగిన సంస్థల నుంచి బిడ్‌లు ఆహ్వానించిన పర్యాటకాభివృద్ధి సంస్థ
వాటి నిర్మాణం పూర్తయ్యాకే ఆపరేషన్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పర్యాటకులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న కారవాన్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వాటి కోసం ముందుగా కారవాన్ పార్కులు నిర్మించి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఆ పార్కుల కోసం బుధవారం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. వాటికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, వారికి పనులు అప్పగించి, అవి పూర్తయిన తరువాత తాపీగా కారవాన్లు విశాఖపట్నం వస్తాయి. అంతవరకు వేచి ఉండక తప్పదు.
విశాఖపట్నంలో గత నవంబరు నెలలో జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించి భారీ సంఖ్యలో ఒప్పందాలు జరిగాయి. అందులో కారవాన్ల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వైజాగ్ రిక్రియేషన్స్ సంస్థ అరకులోయ, లంబసింగిల్లో రెండు కారవాన్లు నడుపుతామని ఎంఓయూ చేసుకుంది. రాత్రి బస కూడా కల్పిస్తామని పేర్కొంది. దీనికి రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టి, 145 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. అదేవిధంగా ఓజీ డ్రీమ్ లైనర్ అనే సంస్థ కూడా కారవాన్లు నడుపుతామని, రూ.25 కోట్ల పెట్టుబడితో 80 మందికి ఉపాధి కల్పిస్తామని ఒప్పందం చేసింది. ఇందులో ఒక సంస్థ అందంగా రూపొందించిన కారవాన్ కూడా విశాఖపట్నం తీసుకువచ్చి నాటి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు డెమో కూడా ఇచ్చింది. అందులో సదుపాయాలు చూసి అధికారులంతా హర్షించారు. నెల రోజుల్లో కారవాన్ అందుబాటులోకి వస్తుందని భావించారు. ఇది జరిగి నాలుగు నెలలైంది. పర్యాటక శాఖాధికారులు ఆ సంగతే మరిచిపోయారు.
కొత్తగా కారవాన్ పార్కుల ప్రతిపాదన
రాష్ట్రమంతటా కారవాన్ టూరిజం నిర్వహించాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. ఈ వాహనాలను పర్యాటక ప్రాంతాల్లో నిలిపి ఉంచి, ఇతర సేవలు కూడా అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో కొంత స్థలాన్ని కేటాయించి, అందులో కారవాన్ పార్కులు అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. పర్యాటకులు రాత్రి బస చేయడానికి, ఆహారం కోసం రెస్టారెంట్, ఇతర వసతులు, రిక్రియేషన్ అన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం అరకు (అంజోడా గ్రామం), ముంచంగిపుట్టు మండలం పోతురాజుపుట్టు, చింతపల్లి మండలం లోతుగెడ్డ కాఫీ ఎస్టేట్ వద్ద మొత్తం మూడు కారవాన్ పార్కులు నిర్మించడానికి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం ఏపీటీడీసీ ప్రకటన జారీచేసింది. ఈ టెండర్ ఖరారై, పనులు పూర్తయి, కారవాన్లు ప్రారంభించేసరికి కచ్చితంగా పర్యాటక సీజన్ (దసరా) వస్తుందని పర్యాటక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో ఐదు పార్కుల నిర్మాణానికి సుమారు రూ.4 కోట్లు వెచ్చించనున్నట్టు ఏపీటీడీసీ పేర్కొంది. పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం భూమి కేటాయిస్తే, అందులో ఏపీటీడీసీ కారవాన్ పార్కులు నిర్మించి ఆయా సంస్థలకు లీజుకు ఇస్తుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది చివర్లో నిర్వహించే విశాఖ ఉత్సవ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.