రైల్వే శాఖ రక్షణ చర్యలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:16 AM
రైల్వే ట్రాక్‌లను ఎక్కడపడితే అక్కడ మనుషులు, జంతువులు దాటకుండా వుండేందుకు, ప్రమాదాలను నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాక్‌లకు ఇరువైపులా రైల్వే శాఖకు చెందిన స్థలాన్ని ఆనుకొని క్రాష్ బారియర్లు (గార్డ్ రెయిల్స్), కాంక్రీట్ బారియర్లు ఏర్పాటు చేస్తున్నారు.
పశువులు, మనుషులు ప్రమాదాలకు గురికాకుండా పటిష్ఠ ఏర్పాట్లు
ట్రాక్‌లకు ఇరువైపులా గార్డ్ రెయిల్స్, కాంక్రీట్ బారియర్లు
పాయకరావుపేట నుంచి అనకపల్లి వరకు జోరుగా పనులు
ఎలమంచిలి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రైల్వే ట్రాక్‌లను ఎక్కడపడితే అక్కడ మనుషులు, జంతువులు దాటకుండా వుండేందుకు, ప్రమాదాలను నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాక్‌లకు ఇరువైపులా రైల్వే శాఖకు చెందిన స్థలాన్ని ఆనుకొని క్రాష్ బారియర్లు (గార్డ్ రెయిల్స్), కాంక్రీట్ బారియర్లు ఏర్పాటు చేస్తున్నారు.
చెన్నై- హౌరా మెయిన్ లైన్‌లో ప్రస్తుతం రెండు రైల్వే ట్రాక్‌లు వుండగా, పలుచోట్ల మూడో ట్రాక్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఏటేటా పాసింజర్, సరుకు రవాణా రైళ్లు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు రైల్వే గేటు వేసిన తరువాత వరుసగా రైళ్లు వస్తుండడంతో అర్ధగంట వరకు గేటు తీయని పరిస్థితి ఏర్పతున్నది. ఇక రైల్వే ట్రాక్‌లు అత్యధికంగా పొలాల మధ్య నుంచే వెళుతుంటాయి. వ్యవసాయ పనులకు వెళ్లే వారు, పశువులతోపాటు వాటి కాపరులు ఆయా ప్రదేశాల్లో రైల్వే ట్రాక్‌ను దాటుతుంటారు. కొన్నిచోట్ల రెండు రైల్వే ట్రాక్‌ల మధ్యనున్న ఖాళీ స్థలంలో పచ్చిగడ్డిని మేయడానికి పశువులు, మేకలు, గొర్రెలు వెళుతుంటాయి. ఈ క్రమంలో అత్యంత వేగంగా వచ్చే రైళ్లను గమనించి, తప్పుకునేలోపే ప్రమాదానికి గురవుతున్నారు. దీనివల్ల ఇటు ప్రాణనష్టం, అటు రైళ్లు ఆలస్యంగా నడవడం వంటివి జరుగుతున్నాయి. గత కొనేళ్ల నుంచి రైళ్ల వేగం కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల పైబడి వేగంగా దూసుకెళుతున్నాయి. దీంతో రైల్వే ట్రాక్‌లపై పశువుల కారణంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు రైల్వే స్థలాలకు కంచె, ప్రహరీ గోడలు వంటివి లేకపోవడంతో ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిని నివారించడానికి రైల్వే అధికారులు పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టారు. లెవెల్ క్రాసింగ్ గేట్లు వున్నచోట మినహా మరెక్కడా పశువులు రైల్వే ట్రాక్‌పైకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. క్రాష్ బారియర్లు (గార్డ్ రెయిల్స్), కాంక్రీట్ బారియర్లు అమర్చుతున్నారు. అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట నుంచి అనకాపల్లి వరకు పలుచోట్ల వీటి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.