తగ్గిన రిజిస్ర్టేషన్ ఆదాయం
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:35 AM
దస్తావేజు లేఖర్ల ‘పెన్ డైన్’ ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై బాగానే పడింది. దస్తావేజు లేఖర్ల నిరసన కార్యక్రమాలకు తోడు, ఆషాఢమాసం కావడంతో జూలై నెలలో ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వం విధించిన ఆదాయ లక్ష్యంలో నర్సీపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయం 58 శాతం మాత్రమే సాధించింది.
నర్సీపట్నం కార్యాలయానికి జూలైలో రూ.3.1 కోట్లు లక్ష్యం
వసూలైంది రూ.1.8 కోట్లు మాత్రమే
దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌తోపాటు ఆషాఢమాసం ప్రభావం
నర్సీపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): దస్తావేజు లేఖర్ల ‘పెన్ డైన్’ ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై బాగానే పడింది. దస్తావేజు లేఖర్ల నిరసన కార్యక్రమాలకు తోడు, ఆషాఢమాసం కావడంతో జూలై నెలలో ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వం విధించిన ఆదాయ లక్ష్యంలో నర్సీపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయం 58 శాతం మాత్రమే సాధించింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఆదాయానికి జూలై నెలలో భారీగా గండి పడింది. పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు ఈ నెల 20వ తేదీ నుంచి ‘పెన్ డౌన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ర్టేషన్లు బాగా తగ్గిపోయాయి. నర్సీపట్నం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో సగటున రోజుకు 20 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన కారణంగా ఈ నెల 22న ఆరు, 24న రెండు, 25న ఒకటి, 28న రెండు, 29న నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగాయి. దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ వల్ల ఆస్తుల క్రయవిక్రయదారులకు ఇబ్బంది లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. డాక్యుమెంట్లు తయారీ, చలానా తీయడం, పబ్లిక్ డేటా ఎంట్రీ, ఈసీ, స్లాట్ బుకింగ్ తదితర సేవలన్నీ అందిస్తున్నారు. దీంతో గురువారం పది రిజిస్ర్టేషన్లు జరిగాయి. కాగా జూలైలో నర్సీపట్నం సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం నుంచి రూ.3.1 కోట్ల ఆదాయం రావాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. కానీ గురువారంనాటికి రూ.1.8 కోట్లు (58 శాతం) మాత్రమే వచ్చింది. కాగా గత ఏడాది జూలై నెలలో రూ.3.12 కోట్ల ఆదాయ లక్ష్యంకాగా రూ.2.11 కోట్ల (67.7 శాతం) ఆదాయం రావడం ఈ సందర్భంగా గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే సుమారు పది శాతం తగ్గింది.
కాగా రిజిస్ట్రేషన్ ఆదాయం లక్ష్యానికి దూరంగా వుండడంపై సబ్ రిజిస్ట్రార్ ఎం ఉమామహేశ్వరరావు వివరణ కోరగా... ఆషాఢ మాసంలో సాధారణంగానే ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు తగ్గుతాయని, దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ ప్రభావం ఏమీ లేదని చెప్పారు. ఆస్తుల క్రయవిక్రయదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్స్ డెస్క్ సిబ్బంది సహకారంతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు.