Share News

మన్యంలో క్షీణించిన కొర్ర సాగు

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:02 AM

గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల పంటల్లో ప్రధానమైన కొర్ర(ఫాక్స్‌టెయిల్‌ మిలెట్‌) సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. ఆదివాసీలు పదేళ్ల క్రితం వరకు రాగి, సామ, కొర్రల పంటలను సమానంగా అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు.

మన్యంలో క్షీణించిన కొర్ర సాగు
పరిశోధన స్థానంలో సాగుచేస్తున్న కొర్ర పంట

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌

కొర్రలో ఆరోగ్యానికి మేలుచేసే గుణాలు పుష్కలం

సాగు చేపడితే రైతులకు అధిక ఆదాయం

చింతపల్లి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల పంటల్లో ప్రధానమైన కొర్ర(ఫాక్స్‌టెయిల్‌ మిలెట్‌) సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. ఆదివాసీలు పదేళ్ల క్రితం వరకు రాగి, సామ, కొర్రల పంటలను సమానంగా అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు. కాలక్రమేణా రాగి, సామ పంటలకు మాత్రమే రైతులు పరిమితమయ్యారు. కొర్రలో అత్యధిక పోషక విలువలు ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నది. గిరిజన రైతులకు సరైన విత్తనం అందుబాటులో లేకపోవడం వల్ల కొర్ర సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తే కొర్రకు గిరిజన ప్రాంతంలో పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం వల్ల మానవులకు మధుమేహం, రక్తపోటు, ఊబకాయం సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఈ నేపఽథ్యంలో ప్రజలు పూర్వీకుల ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రజలందరూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. చిరుధాన్యాల్లో కొర్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఆరోగ్యానికి మేలుచేసే లక్షణాలు, పోషక విలువలు అధికంగా వున్నాయి. దీంతో మార్కెట్‌లో కొర్ర బియ్యాన్ని ప్రజలు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కొర్ర సాగు చేసుకుంటే గిరిజన రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

చిరుధాన్యాలకు అనుకూలం

గిరిజన ప్రాంత నేలలు, వాతావరణం చిరుధాన్యాల సాగుకు అత్యంత అనుకూలమని 40 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. గతంలో ఆదివాసీలు చిరుధాన్యాలను సంప్రదాయ పంటలుగా సాగు చేసేవారు. కాలక్రమంగా వరి, ఇతర పంటలపై ఆకర్షితులు కావడంతో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గిరిజన ప్రాంతంలో తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో రాగి 15,217 హెక్టార్లు, సామ 2,462 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పదేళ్ల క్రితం కొర్రను ఆదివాసీ రైతులు 15 వేల హెక్టార్లలో సాగు చేసేవారు. ప్రస్తుతం కేవలం 59 హెక్టార్లలో మాత్రమే సాగు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కొర్ర సాగును ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో గిరిజన ప్రాంతంలో పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది.

సాగుకు ఇదే అదును

గిరిజన ప్రాంతంలో ఖరీఫ్‌ పంటగా కొర్ర పంట సాగు చేసుకునేందుకు ఇదే సరైన సమయమని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గిరిజన ప్రాంతానికి రేనాడు, ప్రసాద్‌, కృష్ణదేవరాయ, నర్సింహారాయ్‌, శ్రీలక్ష్మి, సాయి3035 రకాలు అత్యంత అనుకూలం. జూలై నెలాఖరు వరకు నాట్లు వేసుకోవచ్చు. వరుసలలో నాట్లు వేసుకుంటే ఎకరానికి రెండు కిలోలు, వెదజల్లే పద్ధతిలో సాగుచేసుకుంటే ఎకరానికి నాలుగు కిలోల విత్తనం అవసరమవుతుంది. వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాట్లు వేసుకోవాలి. కొర్ర సాగుపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో కొర్ర దిగుబడులు హెక్టారుకి 4-5 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది.

మార్కెట్‌లో అధిక ధర

రాగి, సామ కంటే కొర్ర బియ్యం(గింజలు)కు అధిక ధర లభిస్తుంది. రైతులు పండించిన కొర్ర బియ్యానికి ప్రాంతీయ మార్కెట్‌లో కిలో రూ.50-60ధర లభిస్తుంది. శుద్ధి, ప్రాసెసింగ్‌ చేసిన కొర్ర బియ్యం సూపర్‌ బజార్లలో కిలో రూ.120-140 ధరకు విక్రయిస్తున్నారు. రోజు రోజుకి చిరుధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ మేరకు కొర్ర పంటను సాగు చేసుకోవడం వల్ల గిరిజన రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు

కొర్రలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు అత్యధికంగా ఉన్నాయి. కొర్రలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా స్థిరంగా ఉంచుతుంది. మధుమేహం బాధితులకు ఉత్తమమైన ఆహారం. అలాగే పీచుపదార్థం అధికంగా ఉండడంతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారు కొర్రను ఆహారంగా తీసుకోవడం మంచిది.

Updated Date - Jul 09 , 2026 | 12:02 AM