Share News

జడ్పీ వికేంద్రీకరణతో జిల్లా అభివృద్ధికి దోహదం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:46 AM

ఇన్నాళ్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్న జిల్లా పరిషత్‌ వికేంద్రీకరణతో జిల్లా అభివృద్ధి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌, జడ్పీ ప్రత్యేకాధికారి టి.నిషాంతి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక జడ్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు.

జడ్పీ వికేంద్రీకరణతో జిల్లా అభివృద్ధికి దోహదం
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

కలెక్టర్‌, జడ్పీ ప్రత్యేకాధికారి నిషాంతి

ప్రజలకు మరింత చేరువగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

ఘనంగా నూతన జిల్లాపరిషత్‌ కార్యాలయం ప్రారంభం

పాడేరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

ఇన్నాళ్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్న జిల్లా పరిషత్‌ వికేంద్రీకరణతో జిల్లా అభివృద్ధి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌, జడ్పీ ప్రత్యేకాధికారి టి.నిషాంతి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక జడ్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జడ్పీ ప్రత్యేకాధికారిగా ఆమె బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో కొత్తగా జిల్లాపరిషత్‌ ఏర్పాటు కావడం ద్వారా స్థానిక అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి అవకాశం కలుగుతుందన్నారు. పాలన వికేంద్రీకరణ కావడంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు సైతం చేరువ అవుతాయన్నారు. అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో విధులు నిర్వహించి, ప్రజలకు మరింత మేలు చేయాలని కలెక్టర్‌ నిషాంతి ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయంలో తాత్కాలికంగా మాత్రమే జిల్లాపరిషత్‌ కార్యాలయం ఏర్పాటు జరిగిందని, స్థానిక పాతపాడేరులోని సామాజిక భవనాన్ని పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత అక్కడే జడ్పీ కార్యాలయం కొనసాగుతుందన్నారు. జిల్లాలో 11 మండలాలు 244 గ్రామ పంచాయతీల్లో 11 జడ్పీటీసీ స్థానాలు, 172 ఎంపీటీసీ స్థానాలున్నాయన్నారు. జడ్పీ కార్యాలయానికి వివిధ స్థాయిల్లో 19 పోస్టులు కేటాయించారన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆర్‌టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ సియ్యారి దొన్నుదొర, రాష్ట్ర జానపదకళలు, సృజనాత్మకత అకాడమి చైర్మన్‌ వంపూరు గంగులయ్య తదితరులు మాట్లాడారు. జిల్లా పరిషత్‌ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టి కలెక్టర్‌ టి.నిషాంతికి ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్‌ సీఈవో నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్‌, డీపీవో కేపీ.చంద్రశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ, డ్వామా పీడీ విద్యాసాగర్‌, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఎంపీడీవోలు, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, కూటమి నేతలు బొర్రా విజయరాణి, మఠం శాంతకుమారి, లకే పార్వతమ్మ, సీదరి రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:46 AM