మృత్యు గెడ్డలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:29 PM
మన్యంలోని గెడ్డలు మృత్యుకుహరాలుగా మారాయి. వేసవిలో స్నానాలకు వెళ్లిన చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నాయి. వర్షాకాలంలో గెడ్డ దాటుతుండగా ఉసురు తీస్తున్నాయి. తాజాగా ఆదివారం పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నేడా గ్రామానికి చెందిన ముగ్గురు బాలలు మత్స్యగెడ్డలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో మన్యంలో గెడ్డల్లో ప్రమాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు
వేసవిలో స్నానాలకు వెళ్లి.. వర్షాకాలంలో గెడ్డలు దాటుతూ మృత్యువాత
తాజాగా పెద్దబయలు మండలంలో ముగ్గురు చిన్నారుల మృతి
తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ఘటనలు
అవగాహన లేమి.. ఏమీ జరగదనే ధీమాయే కారణం
(పాడేరు/పెదబయలు/ముంచంగిపుట్టు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, అరకులోయ మండలాల్లోని గెడ్డల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. ఈనెల రెండో తేదీన అనంతగిరి మండలం మల్లంగుమ్మి జలపాతంలో ముగ్గురు బాలికలు మునిగి మృతి చెందిన ఘటన మరువక ముందు ఈనెల 12వ తేదీ ఆదివారం పెదబయలు మండలం లకేపుట్టు సమీపంలోని మత్స్యగెడ్డలో స్నానాలకు వెళ్లిన ముగ్గురు బాలురు మునిగి ప్రాణాలు కోల్పోయారు. గిరిజన ప్రాంతంలోని యువత, బాలలు గెడ్డల్లో ఈత, స్నానాలు, చేపల వేట వంటివి కొత్తకాదు. కాని ఊహించని విధంగా పలు సందర్భాల్లో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయా గెడ్డలు తాము నిత్యం స్నానాలు చేస్తున్నవే కాదా.. అనే ధీమా నేపథ్యంలో యువత అప్రమత్తంగా లేకపోవడం ప్రమాదాలకు కారణమని ఇటీవల జరిగిన ఘటనల్లో స్పష్టమైంది. అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దున ఉన్న మల్లంగుమ్మి జలపాతంలో ఆయా ప్రాంతాలకు చెందిన చిన్నా పెద్దా నిత్యం జలకాలాడడం సర్వసాధారణం. కానీ అనుకోని విధంగా బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన బాలికలు సాలేపు త్రిష(17), రత్నకుమారి(16), సాలేపు పవిత్ర(15) మల్లంగుమ్మిలో స్నానాలు చేస్తుండగా అకస్మాత్తుగా ముందుకు వెళుతూ అక్కడున్న గుమ్మిలో మునిగి మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే తాజాగా ఆదివారం పెదబయలు మండలంలోని మత్స్యగెడ్డలోని పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గురు బాలలు జి.హర్షిత్(10), కె.ప్రదీప్(10), పి.బబ్లూ(8) ఎప్పటిలాగానే సమీపంలోని మత్స్యగెడ్డలో సాన్నానికి వెళ్లారు. అయితే స్నానాలతోపాటు గెడ్డలోని చేపలను పట్టాలనే సరదాతో వారు మరింత ముందుకు వెళ్లిన క్రమంలోనే లోతుగా ఉన్న ప్రదేశంలో మునిగిపోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తున్నది. వాస్తవానికి గెడ్డలు, వాగులు ఎప్పుడూ ఒకే లోతు ఉండవు. ఆ విషయాన్ని గుర్తించని కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలకు గెడ్డల్లోని ప్రవాహాలు అధికమైన పలుమార్లు లోతు ఏర్పడడంతోపాటు అక్కడక్కడ గుమ్మిలు సైతం ఏర్పడతాయి. అయితే తాజా పరిస్థితులను కనీసం అంచనా వేయని వారు గతంలో మాదిరిగానే ఉందనేఆలోచనతో గెడ్డలో దిగడం, మునిగి ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బాలికలు, చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చడం తీవ్ర ఆవేదనకు గురి చేసే అంశం.
పడవ ప్రమాదాలు ఎన్నో..
ఏజెన్సీలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఏదో ప్రాంతంలో గెడ్డలు ఉండడం, వాటి అవతల పలు గిరిజన గ్రామాలుండడం, ఈక్రమంలో గెడ్డల్లో నాటు పడవలతో రాకపోకలు సాగిస్తున్న క్రమంలో జరిగే ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది మార్చి 9న ముంచంగిపుట్టు మండల కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన గిరిజన రైతు వంత గోపినాఽథ్ మండల కేంద్రంలో అరటిపళ్ల విక్రయించేందుకు నాటుపడవపై వస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహం కోసం పది రోజులు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించాయి. ఇటువంటి ఘటనలు జీకేవీధి మండలం సీలేరు, గుప్పిలవాడ ప్రాంతాలతోపాటు, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో వర్షాకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహించడం, తమ అవసరాలకు గిరిజనులు గెడ్డలు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి
ఎస్‌పీ అమిత్‌బర్దార్
ఏజెన్సీలోని గెడ్డలు, జలపాతాల్లో ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పీ అమిత్‌బర్దార్ సూచించారు. పెదబయలు మండలంలో మత్స్యగెడ్డలో మునిగి ముగ్గురు బాలలు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి నేపథ్యంలో గెడ్డల్లో నీరు తక్కువగా ఉంటుందని స్నానాలకు వెళ్లవద్దని, గెడ్డల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తమ పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు? ఏమి చేస్తున్నారనేది తల్లిదండ్రులు విధిగా గమనించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.