Share News

దారికాచిన మృత్యువు

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:23 AM

భోగాపురం సమీపంలో మంగళవారం ఉదయం జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వేగంగా థార్‌ జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.

దారికాచిన మృత్యువు

రహదారుల పక్కన ఇష్టారాజ్యంగా భారీ వాహనాలు నిలిపివేత

వెనుక వైపు కానరాని రిఫ్లెక్టర్లు, వార్నింగ్‌ లైట్లు

చీకట్లో ఆపి ఉన్నవాటిని గుర్తించలేకపోతున్న వాహన చోదకులు

భోగాపురం, బాటజంగాలపాలెం వద్ద ప్రమాదాలకు అదే కారణం

రోడ్డు పక్క పార్కింగ్‌ను నియంత్రించడంలో

పోలీస్‌, రవాణా శాఖల వైఫల్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురం సమీపంలో మంగళవారం ఉదయం జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వేగంగా థార్‌ జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.

సబ్బవరం సమీపంలోని బాటజంగాలపాలెం వద్ద మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాలర్‌ను వెనుక నుంచి వచ్చిన డంపర్‌ లారీ బలంగా ఢీకొనడంతో కేబిన్‌లో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు.

...ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడడంతో జాతీయ రహదారి పక్కన ఇష్టారాజ్యంగా భారీ వాహనాల నిలుపుదలపై మరోసారి చర్చ మొదలైంది.

నగరం మీదుగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వెళుతోంది. ఈ రహదారిపై నిత్యం కంటెయినర్లు, ట్యాంకర్‌లు, సరుకు రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతోపాటు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే కేంద్ర ప్రభుత్వం ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు కొత్తగా జాతీయ రహదారిని నిర్మించింది. దాంతో భారీ వాహనాలన్నీ నగరంలోకి ప్రవేశించకుండా ఆనందపురం నుంచి అనకాపల్లి వైపు, అనకాపల్లి నుంచి ఆనందపురం వైపు వెళ్లిపోతాయని నగరవాసులు భావించారు. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన జాతీయ రహదారిపై రెండు టోల్‌ గేట్లు ఉండడంతో వాటిని తప్పించుకునేందుకు నగరం మీదుగానే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు పోర్టు, స్టీల్‌ప్లాంటు, హెచ్‌పీసీఎల్‌, కోరమండల్‌ వంటి పరిశ్రమలకు సరుకు రవాణా కోసం వచ్చే లారీలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. పోలీస్‌ అధికారులు అంచనా ప్రకారం ప్రతిరోజూ 1,500 వరకూ భారీ వాహనాలు నగరంలోని ప్రధాన రహదారులు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.

రోడ్లపక్కనే భారీ వాహనాలు నిలుపుదల

భారీ వాహనాలను డ్రైవర్లు రాత్రి సమయంలో విశ్రాంతి కోసం జాతీయ రహదారి/ప్రధాన రహదారుల పక్కన ఎక్కడపడితే అక్కడ నిలిపేస్తున్నారు. రాత్రివేళ, తెల్లవారుజాము సమయాల్లో ఆ మార్గంలో వెళ్లే వాహనాలు, ప్రధానంగా కార్లు నడిపేవారు ఆగి ఉన్న వాహనాలను గమనించడంలో తడబడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నగర పరిధిలో ఇటు తగరపువలస, ఆనందపురం, గంభీరం, అటు గాజువాక, కూర్మన్నపాలెం, ఆటోనగర్‌, పోర్టు రోడ్డు, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రధాన రహదారుల పక్కనే భారీ వాహనాలను నిలిపేస్తున్నారు. ఇంకా తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, మారికవలస వంటి ప్రాంతాల్లో కూడా నిత్యం వాహనాలను రోడ్డుపక్కనే ఆపేసి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా నిలపడం వల్ల రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుపక్కన పార్కింగ్‌ చేసే భారీ వాహనాలపై కేసులు నమోదుచేయడం, భారీగా జరిమానాలు విధించడం చేస్తే ప్రమాదాలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రమాదాల నివారణకు ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది

- భారీ వాహనాల కోసం నగర శివారు ప్రాంతాల్లో పార్కింగ్‌ యార్డులను అందుబాటులోకి తేవాలి. అక్కడే డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, భోజన సదుపాయం వంటివి ఉండాలి.

- పోర్టు సమీపాన 670 లారీల పార్కింగ్‌కు వీలుగా యార్డు ఉంది. నగరంలో రోడ్డుపక్కన ఆపే లారీలను అక్కడకు తరలించే ప్రయత్నం చేయాలి. అదనంగా మరికొన్ని యార్డులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రవాణా, ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు ప్రణాళికలు అమలుచేయాలి.

- నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపక్కన నిలిపే వాహనాలపై కేసులు నమోదుచేయడంతో పాటు భారీ జరిమానాలు విధించాలి.

- ఒకవేళ భారీ వాహనాలు రాత్రిపూట నిలుపుదల చేసినా వెనుక నుంచి వచ్చే వాహన చోదకులు వాటిని స్పష్టంగా గమనించేలా తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.

- నగరంలోకి భారీ వాహనాలను నిర్దేశించిన సమయాల్లోనే అనుమతించాలి.

Updated Date - Nov 26 , 2026 | 01:23 AM