కబళించిన మృత్యువు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:55 AM
సరదాగా క్రికెట్ ఆడుకుని, తిరిగి ఇంటికి బయలుదేరిన యువకులను వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యువై కబళించింది.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
ఇద్దరు యువకుల దుర్మరణం
మంగమారిపేట వద్ద సంఘటన
భీమునిపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):
సరదాగా క్రికెట్ ఆడుకుని, తిరిగి ఇంటికి బయలుదేరిన యువకులను వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యువై కబళించింది. వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో రెండుపదుల వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఈ సంఘటన భీమిలి మండలం మంగమారిపేట కూడలి వద్ద ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
నగరంలోని అల్లిపురం రైతుబజారు ప్రాంతానికి చెందిన పిళ్లా ధనుంజయ (20) అతని స్నేహితుడు వి.అఖిల్ (21) ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నగరంపాలెంలో క్రికెట్ ఆడుకునేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అక్కడి ఐఎన్‌ఎస్ కళింగ సమీపంలో 9 గంటల వరకు క్రికెట్ ఆడుకున్నారు. అనంతరం తిరిగి నగరానికి బయలుదేరారు. అమిత వేగంగా వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం మంగమారిపేట జంక్షన్ సమీప శివాజీ విగ్రహం వద్దకు చేరుకునేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తుళ్లి రోడ్డుపై పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. హెల్మెట్‌లు ధరించకపోవడంతో తలకు బలమైన గాయమై అఖిల్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన ధనుంజయను 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ధనుంజయ తండ్రి పిళ్లా ఎల్లాజీ ఫిర్యాదు మేరకు సీఐ జి.దివాకర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.