Share News

వార్డుల విభజనకు గడువు పెంపు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:38 AM

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీకి గడువును ఈనెల 25వ తేదీ వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

వార్డుల విభజనకు గడువు పెంపు

ఈనెల 25న ప్రాథమిక నోటిఫికేషన్‌

27 నుంచి వచ్చే నెల మూడు వరకు అభ్యంతరాల స్వీకరణ

కొత్తవార్డులపై మే 28-30 మధ్య గెజిట్‌ విడుదల

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీకి గడువును ఈనెల 25వ తేదీ వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల సంఖ్యను పెంచడంతోపాటు పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఈనెల తొమ్మిది వరకు గడువిస్తూ ప్రభుత్వం రెండో తేదీన ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులకు పెంచాలని సూచించింది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఇప్పటికే వార్డుల పునర్విభజన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అయితే రాష్ట్రంలో కొన్నిచోట్ల కొత్త వార్డులకు సరిహద్దులు నిర్ణయించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు వాటిని అధిగమించేందుకు చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేయడం సాధ్యం కాదని కొందరు వివరించినట్టు తెలిసింది. దీంతో వార్డుల విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీకి గడువును ఈనెల తొమ్మిది నుంచి 25కి పెంచుతూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు, నివాసిత సంఘాల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 27 నుంచి వచ్చే నెల మూడు వరకు అవకాశం కల్పించింది. అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తుది నివేదికను సీడీఎంఏకు సమర్పించడానికి మే ఐదు నుంచి 15 వరకు గడువు ఇచ్చింది. సీడీఎంఏ పరిశీలన తర్వాత ప్రజా ప్రతినిధుల ఆమోదంతో తుది నివేదికను వచ్చేనెల 16 నుంచి 27వ తేదీ మధ్య ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, తర్వాత అన్నివర్గాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత మే 28 నుంచి 30 మధ్యలో కొత్తవార్డుల సరిహద్దులతో తుది నోటిఫికేషన్‌ జారీచేస్తారు.


ఉక్కు రిటైర్డ్‌ ఉద్యోగులపై బీమా భారం!

ఆర్థిక ఇబ్బందుల పేరుతో కొత్త నిబంధనలు

రూ.1,300కు బదులు రూ.8,512 చెల్లించాలని ఉత్తర్వులు

యాజమాన్యం నిర్ణయంపై ఆందోళన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం తమ పట్ల నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల పేరుతో జీతాలు అరకొరగా ఇస్తున్న యాజమాన్యం ఇప్పుడు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల కూడా కఠిన నిర్ణయం తీసుకోవడాన్ని అంతా వ్యతిరేకిస్తున్నారు. ప్లాంటులో జీవితకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి గ్రూపు ఇన్సూరెన్స్‌ మెడికల్‌ స్కీమ్‌ (జీఎంఐఎస్‌) పేరుతో ఆరోగ్య బీమాను కొన్ని దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగి ఏడాదికి ప్రీమియం కింద రూ.1,300 చెల్లిస్తే, మిగిలిన మొత్తం యాజమాన్యం భరించేది. భార్యాభర్తలు ఇద్దరికీ చెరో రూ.3 లక్షలు చొప్పున బీమా వర్తించేది. అలాగే ఎక్కడైనా చికిత్స చేయించుకుంటే ఏడాదికి రూ.18 వేల వరకు బిల్లు పెట్టుకునే వెసులుబాటు ఉండేది. మార్చి 31తో ప్రీమియం గడువు ముగియగా ఏప్రిల్‌ ఏడో తేదీ వచ్చినా వాటిని రెన్యువల్‌ చేయలేదు. కొత్త స్కీమ్‌ను అమలు చేస్తున్నామని నాలుగు రోజుల క్రితం (శనివారం) ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటూ ప్రీమియం తాము కొంత మాత్రమే భరిస్తామని రిటైర్డ్‌ ఉద్యోగులు వయసును బట్టి మిగిలిన మొత్తం చెల్లించాలని పేర్కొంది. 70 ఏళ్లలోపు వారు ఏడాదికి రూ.8,512 చెల్లించాలని, 71 నుంచి 80 ఏళ్ల లోపు వారు 5,674 కట్టాలని, 81 నుంచి 90 ఏళ్ల మధ్య వయస్కులు 2,837 చెల్లించాలని, 90 ఏళ్ల పైబడినవారు పాత పద్ధతిలో రూ.1,300 కడితే సరిపోతుందని పేర్కొంది. ఇంత ప్రీమియం పెరిగినా బీమా మొత్తం రూ.6 లక్షలే ఉంటుందని, బిల్లు కూడా రూ.18 వేలకే పరిమితం అని స్పష్టంచేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసి కార్మిక, ఉద్యోగ సంఘాలు గత వారం రోజులు ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా తన నిర్ణయాన్నే అమలు చేసింది. ఈ భారం ప్లాంటులో రిటైరైన 20 వేల మందిపై పడనుంది.

కొందరికి పెన్షన్‌ నెలకు రూ.2 వేలే

స్టీల్‌ప్లాంటులో కొందరు కార్మికులకు నెలకు రూ.2 వేలు మాత్రమే పెన్షన్‌ వస్తుంది. వీరి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. వీరికి ఏడాదికి రూ.24 వేలు మాత్రమే అందుతుంది. అలాంటి వారు ఇప్పుడు బీమా కోసం రూ.8 వేల పైబడి చెల్లించాల్సి ఉంటుంది. తాము అంత ఎలా కట్టగలమని వారు ప్రశ్నిస్తున్నారు. స్టీల్‌ ప్లాంటులో కాలుష్యం మధ్య పనిచేయడం వల్ల దాదాపు 80 శాతం మందికి అనారోగ్యం ఉంటుందని, ఆరోగ్య బీమా వల్ల చికిత్సలు చేయించుకోగులుగుతున్నామని, ఇప్పుడు ప్రీమియం పెంచితే తాము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంపీ శ్రీభరత్‌ న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి పరిస్థితి వివరించినా బీమా ప్రీమియం పెంచడానికే యాజమాన్యం మొగ్గు చూపడం విచారకరమని పలువురు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేలా కూటమి నాయకులు చూడాలని రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


విమ్స్‌లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సలు

రెండు చెవులకు శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు

అందుబాటులో నిపుణులైన వైద్యులు,

అత్యాధునిక పరికరాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలు జోరుగా నిర్వహిస్తున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు 28 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. రెండు చెవులకు కాక్లియర్‌ శస్త్ర చికిత్సను నిర్వహించిన తొలి ఆస్పత్రిగా కూడా విమ్స్‌ గుర్తింపు దక్కించుకుంది. 2018లో రెండు, 2019లో ఐదు శస్త్ర చికిత్సలు నిర్వహించగా, కరోనా వల్ల 2020, 2021లో నిలిచిపోయాయి. ఆ తరువాత మళ్లీ 2022లో ఐదు శస్త్రచికిత్సలు నిర్వహించగా, ఇందులో రెండు చెవులకు నిర్వహించినవి నాలుగు ఉన్నాయి. అలాగే 2023లో మూడు నిర్వహించగా, రెండు చెవులకు చేసినవి రెండు ఉన్నాయి. 2024లో ఒకటి నిర్వహించగా, ఆ ఒక్కటి కూడా రెండు చెవులకు చేశారు. 2025లో ఐదు శస్త్ర చికిత్సలను నిర్వహించారు. 2026లో ఇప్పటివరకు ఏడు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.

ఈఎన్‌టీ సేవలకు రోగుల తాకిడి

ఈఎన్‌టీ వైద్య సేవలకు ఇప్పటివరకూ పెదవాల్తేరులోని ఆస్పత్రిపై ఆధారపడాల్సి వచ్చేది. విమ్స్‌లో ఈఎన్‌టీ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత భారీ సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,825 మంది ఓపీ సేవలు వినియోగించుకోగా, 129 మంది ఇన్‌పేషెంట్లుగా సేవలు పొందినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ సేవలు..

విమ్స్‌ ఈఎన్‌టీ విభాగంలో చెవి నొప్పి, చీము కారడం, వినికిడి లోపం, ముక్కు మూసుకుపోవడం, రక్తస్రావం, అలర్జీ, తుమ్ములు, తల వంచితే ముక్కు నుంచి నీరు కారడం, ఆహారం మింగడంలో ఇబ్బందులు, టాన్సిల్స్‌ వాపు, నిద్రలో ఇబ్బందులు, గురక, ముక్కు మధ్య భాగం సరిచేయడం, కర్ణభేరి పునర్నిర్మాణంలో లోపాలు, చెవి, శ్వాసనాళంలో పడే రంధ్రాలను సరిచేయడం, సైనసైటిస్‌, వాయిస్‌ థెరపీ, చెవి వెనుక భాగంలో అదనంగా పెరిగిన ఎముక తొలగింపు, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.

మరింత మందికి సేవలు అందించడమే లక్ష్యం

- డాక్టర్‌ కె.రాంబాబు, విమ్స్‌ డైరెక్టర్‌

విమ్స్‌లో 2018 నుంచి కాక్లియర్‌ విభాగం అందుబాటులో ఉంది. అయితే, వైద్యులు తగినంత అందుబాటులో లేకపోవడంతో సేవలు పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అధునాతన వైద్య పరికరాలు, తగినంతమంది వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడంతో క్రమంగా సేవలను విస్తరిస్తున్నాం. గడిచిన ఏడాది నుంచి ఈ విభాగానికి రోగుల సంఖ్య పెరిగింది. ఆస్పత్రిలో అందిస్తున్న ఈఎన్‌టీ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. వినికిడి సమస్యతో బాధపడే చిన్నారులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి అవసరమనుకుంటే కాక్లియర్‌ శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నాం. నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉంది.

Updated Date - Apr 08 , 2026 | 12:38 AM