Share News

డీసీసీబీకి రూ.3.58 కోట్ల నికరలాభం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:47 AM

గడచిన (2025-26) ఆర్థిక సంవత్సరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రికార్డు స్థాయిలో రూ.2,849.78 కోట్ల వ్యాపారం చేసినట్టు పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు.

డీసీసీబీకి రూ.3.58 కోట్ల నికరలాభం

అంతక్రితం ఏడాదితో పోల్చితే 82.65 శాతం వృద్ధి

గడచిన ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.2,849.78 కోట్ల వ్యాపారం

రూ.1,145.22 కోట్లు డిపాజిట్లు, రూ.1704.56 కోట్ల రుణాలు

రైతులకు రుణ పరపతి పెంచాం

ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు...

అందుబాటులోనికి యూపీఏ సేవలు

రైతులు, ఖాతాదారులకు బీమా సౌకర్యం

పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

గడచిన (2025-26) ఆర్థిక సంవత్సరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రికార్డు స్థాయిలో రూ.2,849.78 కోట్ల వ్యాపారం చేసినట్టు పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు. అంతక్రితం ఏడాది 2024-25తో (రూ.2,400 కోట్లు) పోల్చితే 2025-26లో 18.49 శాతం వృద్ధి సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. మంగళవారం మర్రిపాలెంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఈవో డీవీఎస్‌ వర్మతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది రూ.1,145.22 కోట్ల డిపాజిట్లు (15.96 శాతం వృద్ధి) సేకరించామని, రూ.1,704.56 కోట్ల రుణాలు (20.56 శాతం వృద్ధి)గా మంజూరుచేశామని వెల్లడించారు. 2024-25లో బంగారు ఆభరణాలపై రూ.382.68 కోట్ల రుణాలు ఇవ్వగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.534.02 కోట్లకు పెరిగిందని వివరించారు. వ్యాపారం పెరిగిన నేపథ్యంలో 2024-25లో రూ.1.96 కోట్లుగా ఉన్న నికరలాభం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.3.58 కోట్లకు (82.65 శాతం వృద్ధి) పెరిగిందన్నారు. రాష్ట్రంలో కరెంట్‌, సేవింగ్స్‌ ఖాతాల్లో ఎక్కువ సొమ్ములు నిల్వ ఉన్న బ్యాంకుగా విశాఖ డీసీసీబీ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యాపారం రూ.3,500 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

విశాఖ డీసీసీబీ పరిధిలో 32 బ్రాంచీలు, 98 సొసైటీలు ఉన్నాయని పేర్కొంటూ 30 సొసైటీలు లాభాల్లో నడుస్తున్నాయని వివరించారు. డీసీసీబీ పరిధిలో మాకవరపాలెం సొసైటీ రూ.84 కోట్ల వ్యాపారం చేయడం ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. చీడికాడ, మాడుగుల, నాగులాపల్లి, తిమ్మరాజుపేట, మునగపాక, కోటవురట్ల సొసైటీలు రూ.50 కోట్లకు మించి వ్యాపారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

మొండి బకాయిలు రూ.62 కోట్లలో రూ.10 కోట్లు వసూలుచేయగా, మిగిలిన రూ.52 కోట్లలో రూ.30 కోట్లు ఏజెన్సీ నుంచి వసూలు కావల్సి ఉందన్నారు. డీసీసీబీలోని 4.56 లక్షల ఖాతాదారుల్లో రైతులు 80 వేల మంది ఉన్నారన్నారు. రైతులు, ఖాతాదారులకు బీమా సౌకర్యం అమలుచేశామని, ప్రమాదవశాత్తూ మరణించిన రైతుకు రూ.4.5 లక్షలు, ఖాతాదారుడికి రూ.2 లక్షల బీమా పరిహారం వస్తోందన్నారు. రైతులు సహజ మరణం అయితే రూ.50 వేలు వస్తుందన్నారు. రైతులకు ఎకరాకు రూ.లక్ష ఉన్న రుణ పరపతిని రూ.మూడు లక్షలకు పెంచామని, ఇతర రుణాల కింద ఎకరాకు రూ.ఐదు లక్షలు, గరిష్ఠంగా రూ.20 లక్షలకు పెంచామని తెలిపారు. తాజాగా డీసీసీబీ పరిధిలో రైతులు, ఖాతాదారులకు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యూపీఏ సేవలు, ఏజెన్సీలో రైతుల కోసం మొబైల్‌ ఏటీఎంలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కొత్తగా ఎనిమిది బ్రాంచీలు ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలు రిజర్వు బ్యాంకు వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అనుమతి వచ్చిన వెంటనే మూడు బ్రాంచీలు ఏజెన్సీలో ప్రారంభిస్తామని కోన తాతారావు తెలిపారు.

Updated Date - Jun 03 , 2026 | 12:47 AM