Share News

డ్వాక్రా సంఘాలకు డీసీసీబీ రుణాలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:56 PM

ఉమ్మడి విశాఖ జిల్లాలో డ్వాక్రా సంఘాలకు డీసీసీబీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్నట్టు పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు.

డ్వాక్రా సంఘాలకు డీసీసీబీ రుణాలు
మాట్లాడుతున్న డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు, పక్కన సీఈవో డీవీఎస్‌ వర్మ

రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు..

టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

2026-27లో బ్యాంకు టర్నోవర్‌ లక్ష్యం రూ.3 వేల కోట్లు

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు

కోటవురట్ల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలో డ్వాక్రా సంఘాలకు డీసీసీబీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్నట్టు పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు. సోమవారం డీసీసీబీ సీఈవో డీవీఎస్‌ వర్మతో కలిసి స్థానిక బ్రాంచ్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు తొమ్మిది శాతం (75 పైసలు) వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెంపు కోసం డీసీసీబీలో రుణాలు తీసుకున్న రైతుల పిల్లల్లో పదో తరగతి పరీక్షల్లో జిల్లాస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.20 వేల చొప్పున, రెండోస్థానంలో నిలిచిన వారికి రూ.15 వేల చొప్పున, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేల చొప్పున ఎంత మంది విద్యార్థులు వుంటే అంత మందికీ నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో చదువుకుంటున్న డీసీసీబీ సభ్య రైతుల పిల్లలకు రెండో సంవత్సరంలో జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.20 వేల చొప్పున, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు తనఖాపై రూ.500 కోట్ల వరకు రుణాలు మంజూరు చేశామన్నారు. రైతులకు సుమారు రూ.1,300 కోట్ల పంట రుణాలు మంజూరు చేశామని, ఖాతాదారుల నుంచి రూ.1,100 కోట్ల మేర డిపాజిట్లు సేకరించామని కోన తాతారావు వివరించారు. 2026-27లో బ్యాంకు టర్నోవర్‌ను రూ.3 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కోటవురట్ల పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి వేచలపు జనార్దన్‌ మాట్లాడుతూ, మండలం మొత్తానికి ఒకే ఒక్క పీఏసీఎస్‌ వుందని, దీనివల్ల రైతులకు సేవలు అందించడంలో జాప్యం జరుగుతున్నదని, అందువల్ల పాములవాక, కె.వెంకటాపురం గ్రామాల్లో కొత్తగా పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి, సీఈవోలు సానుకూలంగా స్పందించారు.

Updated Date - Mar 09 , 2026 | 11:56 PM