డీబీ పంచాయితీ!
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:39 AM
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో డ్రాయింగ్ బ్రాంచి (డీబీ) పోస్టుల కోసం జోరుగా పైరవీలు నడుస్తున్నాయి. ఒకరు డీబీగా ఉండగానే, మరొకరు అదే పోస్టు కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అందుకు తలొగ్గి ఉన్నతాధికారులు ఒకవేళ బదిలీ చేస్తే...ఆ పోస్టులో ఉన్నవారు కదిలేందుకు ఇష్టపడడం లేదు.
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ల లొల్లి
డ్రాయింగ్ బ్రాంచి పోస్టుల కోసం పోటీ
భారీగా కమీషన్లు వచ్చే సీటు కావడంతో పైరవీలు
వాటికి తలొగ్గుతున్న ఉన్నతాధికారులు
సీనియర్లను కాదని జూనియర్ల నియామకం
కొత్త పోస్టులు సృష్టించి మరీ కట్టబెడుతున్న వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో డ్రాయింగ్ బ్రాంచి (డీబీ) పోస్టుల కోసం జోరుగా పైరవీలు నడుస్తున్నాయి. ఒకరు డీబీగా ఉండగానే, మరొకరు అదే పోస్టు కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అందుకు తలొగ్గి ఉన్నతాధికారులు ఒకవేళ బదిలీ చేస్తే...ఆ పోస్టులో ఉన్నవారు కదిలేందుకు ఇష్టపడడం లేదు.
ఇంజనీరింగ్ విభాగంలో డ్రాయింగ్ బ్రాంచి (డీబీ)ది అత్యంత కీలకపాత్ర. ఏదైనా పనికి ఏఈలు అంచనాలు తయారుచేసిన తర్వాత దానికయ్యే ఖర్చును సంబంధిత జోన్ డీబీలే లెక్కించి, టెండర్ షెడ్యూల్‌ను తయారుచేస్తారు. అనంతరం టెండరు పిలిచి ఎంపికైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పని పూర్తయిన తర్వాత వర్క్ ఇన్‌స్పెక్టర్, ఏఈ కొలతలు వేసి బిల్లు చేయడానికి తిరిగి డీబీలకు ఫైల్ పంపిస్తారు. డీబీలు టెండర్ షెడ్యూల్‌లో పేర్కొన్న ధరలను అనుసరించి బిల్లు తయారుచేసి ఏఈల ద్వారా ఉన్నతాధికారులకు పంపించాలి. ఈ ప్రక్రియలో డీబీలే ప్రధానపాత్ర పోషిస్తారు.
మొత్తం 18 మంది...
జీవీఎంసీ పరిధిలోని పది జోన్‌లకు పది మంది డీబీలు ఉన్నారు. వీరుకాకుండా మెకానికల్ విభాగానికి ఇద్దరు, నీటి సరఫరా విభాగంలో ముగ్గురు, ప్రాజెక్ట్స్‌లో ఇద్దరు, ఎలక్ర్టికల్ విభాగానికి ఒకరు మొత్తం 18 మంది డీబీలు ఉన్నారు. డీబీ పోస్టులో సివిల్ పనులకు సంబంధించిన పరిజ్ఞానంతోపాటు క్షేత్రస్థాయిలో పనులు చేసినప్పుడు పరిస్థితులు, జరిగిన పనికి కొలతలు వేయడం వంటి అంశాల్లో ప్రత్యక్ష అనుభవం కలిగిన టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (ఏటీఓ), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (జేటీఓ)లను నియమిస్తారు. అయితే టీవోలు, ఏటీవోలు, జేటీవోలు జీవీఎంసీలో కేవలం పది మంది మాత్రమే ఉండడంతో మిగిలిన ఎనిమిది పోస్టుల్లో కనీసం 15 ఏళ్లు అనుభవం కలిగిన వర్క్ ఇన్‌స్పెక్టర్లకు అవకాశం ఇవ్వడం అనవాయితీగా వస్తోంది.
కమీషన్ కక్కుర్తి...
డీబీ పోస్టులో ఉన్నవారికి అదనపు ఆదాయం భారీగా వస్తుందనే వాదన వినిపిస్తోంది. కాంట్రాక్టర్లు పని దక్కించుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు పని విలువలో 0.25 శాతం, పని పూర్తిచేసిన తర్వాత బిల్లు కోసం ఫైల్ పెట్టినప్పుడు మరో 0.25 శాతం డీబీలకు కమీషన్‌గా ఇస్తుంటారని ఇంజనీరింగ్ విభాగం సిబ్బందే చెబుతున్నారు. జీవీఎంసీ పరిధిలో నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతుండడంతో డీబీలకు భారీగా ఆదాయం వస్తుందని, ఈ నేపథ్యంలో పోస్టుల కోసం వర్క్ ఇన్‌స్పెక్టర్లు తీవ్రంగా పోటీపడుతుంటారని చెబుతున్నారు. నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఒక డీబీ మూడు నెలలు సెలవుపై వెళ్లారు. దీంతో అధికారులు ఆ పోస్టులో మరొకరిని నియమించారు. మెటర్నరీ సెలవులో వెళ్లిన వర్క్ ఇన్‌స్పెక్టర్ తిరిగి విధుల్లో చేరిన తర్వాత గతంలో పోస్టు ఇవ్వాలని పట్టుబట్టారు. ఆమె భర్త కూడా వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండడంతో ఉన్నతాధికారులపై ఒత్తిడితెచ్చి మరీ అదే పోస్టును ఇప్పించారు. అక్కడ పనిచేసిన డీబీని వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఫీల్డ్‌కు పంపించేశారు. తాజాగా మెకానికల్ విభాగంలో మూడు డీబీలుండగా అందులో ఒక డీబీపై వర్క్ ఇన్‌స్పెక్టర్ కన్నేశారు. ఖాళీ లేదని అధికారులు చెప్పినప్పటికీ అక్కడ పనిచేస్తున్న ఒకరిని సౌత్ జోన్‌కు బదిలీ చేశారు. కానీ ఆమె తాను వెళ్లేది లేదని చెప్పడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోసం మెకానికల్ విభాగంలోనే మరో డీబీ పోస్టును క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం డీబీలుగా ఉన్న ఎనిమిది మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లకు కనీసం ఆరేళ్ల సర్వీసు కూడా లేదని, సీనియర్లు, క్షేత్రస్థాయి పనులపై అవగాహన ఉన్న వారున్నా పైరవీలు చేసిన వారికే అధికారులు పెద్దపీట వేస్తున్నారని కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఆరోపిస్తున్నారు.