అత్తపై కోడలి దాష్టీకం
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:52 AM
కూరగాయలు పండించి, అమ్మగా వచ్చిన డబ్బులు కుమార్తెలకు ఇస్తోందనే అపోహతో అత్తపై విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా, ఆమెను పొలంలో ఈడ్చుకుపోయిన కోడలి ఉదంతమిది.
సంపాదన కుమార్తెలకు ఇస్తోందని అపోహ
పంట ధ్వంసం చేసేందుకు యత్నం
అడ్డుకున్న అత్తను ఈడ్చుకుపోయి విచక్షణారహితంగా దాడి
అగనంపూడిలో సంఘటన
కూర్మన్నపాలెం (విశాఖపట్నం), జూన్ 30 (ఆంధ్రజ్యోతి):
కూరగాయలు పండించి, అమ్మగా వచ్చిన డబ్బులు కుమార్తెలకు ఇస్తోందనే అపోహతో అత్తపై విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా, ఆమెను పొలంలో ఈడ్చుకుపోయిన కోడలి ఉదంతమిది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ నగర శివారు అగనంపూడికి చెందిన పెదిరెడ్ల అచ్చియ్యమ్మ (78) భర్త మృతి చెందడంతో తనకున్న పది సెంట్ల స్థలంలో కూరగాయలు పండించి, విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తోంది. ఆమెకు ఓ కుమారుడు నాగేశ్వరరావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అచ్చియ్యమ్మ తన సంపాదనను కుమార్తెలకు ఇస్తోందనే అపోహతో కోడలు పెదిరెడ్డ చిన్నమ్మలు తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో మంగళవారం తన స్థలంలోని కూరగాయల పంటను చిన్నమ్మలు ధ్వంసం చేయడానికి వెళ్లిందనే సమాచారంతో అచ్చియ్యమ్మ తన మనవడు (కుమార్తె కొడుకు) సాయిని వెంటబెట్టుకుని పొలం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న కోడలు చిన్నమ్మలను నిలదీసింది. దీంతో కోపోద్రిక్తురాలైన చిన్నమ్మలు అత్తను తీవ్రంగా దుర్భాషలాడుతూ తోసివేసింది. అంతేకాకుండా ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి, ఈ పొలం నాది ఉంటూ ఆగ్రహంతో ఊగిపోయి, అత్తను పొలంలో పడవేసి ఈడ్చుకుపోయింది. దీంతో అచ్చియ్యమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.