సంతల్లో దసరా రద్దీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:59 AM
మండల కేంద్రమైన అచ్యుతాపురం, మోసయ్యపేట సంతల్లో శుక్రవారం దసరా పండుగ ముందస్తు ప్రభావం కనిపించింది. నాటు కోళ్లు, గొర్రెలు, మేకల విక్రయ/ కొనుగోలుదారులతో రద్దీగా మారింది. సాధారణ రోజులతో పోలిస్తే నాటుకోళ్లు, జీవాల ధరలు 25 శాతానికిపైగా పెరిగాయని కొనుగోలుదారులు చెబుతున్నారు.
కొనుగోలుదారులతో కిటకిటలాడిన అచ్యుతాపురం, మోసయ్యపేట సంతలు
నాటుకోళ్లు, గొర్రెపొట్టేళ్లు, మేకపోతులకు గిరాకీ
సాధారణ రోజులతో పోలిస్తే 25 శాతానికిపైగా పెరిగిన ధరలు
అచ్యుతాపురం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన అచ్యుతాపురం, మోసయ్యపేట సంతల్లో శుక్రవారం దసరా పండుగ ముందస్తు ప్రభావం కనిపించింది. నాటు కోళ్లు, గొర్రెలు, మేకల విక్రయ/ కొనుగోలుదారులతో రద్దీగా మారింది. సాధారణ రోజులతో పోలిస్తే నాటుకోళ్లు, జీవాల ధరలు 25 శాతానికిపైగా పెరిగాయని కొనుగోలుదారులు చెబుతున్నారు.
అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో అచ్యుతాపురం సంత, గాజువాక రోడ్డులో గురుకుల బాలికల పాఠశాల వద్ద మోసయ్యపేట వద్ద ప్రతి శుక్రవారం సంతలు జరుగుతుంటాయి. అచ్యుతాపురం, మునగపాక, కశింకోట, ఎలమంచిలి మండలాల నుంచి పలువురు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, నాటుకోళ్లు, పశువులు, గొర్రెలు, మేకలను తీసుకొచ్చి సంతలో విక్రయిస్తుంటారు. సముద్ర తీరగ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులను అమ్ముతుంటారు. కాగా ఈ నెల 20వ తేదీ మంగళవారం దసరా పండుగ కావడంతో నాటు కోళ్లు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేయడానికి అనకాపల్లి జిల్లాతోపాటు విశాఖ, విజయనగరం, కాకినాడ జిల్లాలనుంచి కొనుగోలుదారులు వచ్చారు. దసరాకు ముందు సంత కావడంతో వీటి ధరలను అమాంతం పెంచేశారు. సుమారు 20 కిలోల బరువున్న మేకపోతు రూ.16 వేలు పలికింది. గొర్రెపొట్టేళ్లను మరింత ఎక్కువ ధరకు విక్రయించారు. సుమారు రెండు కిలోల బరువున్న నాటుకోడిని గత వారం రూ.1,600కి విక్రయించగా... ఈ రూ.2 వేలకు పైబడి విక్రయించారు. దూరప్రాంతాల నుంచి మటన్, చికెన్ షాపుల నిర్వాహకులు వచ్చి అధిక సంఖ్యలో జీవాలను కొనుగోలు చేసి, వ్యాన్లో తరలించుకుపోయారు.
తిమిరాం సంత కిటకిట
దేవరాపల్లి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మరో నాలుగు రోజుల్లో దసరా పండుగ వుండడంతో మండలంలోని తిమిరాం సంతకు కొనుగోలుదారులు పోటెత్తారు. ముఖ్యంగా మేకపోతులు, గొర్రె పొట్టేళ్లు, నాటుకోళ్ల కొనుగోలు కోసం అనకాపల్లి జిల్లాతో విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు, సాధారణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సంత ప్రదేశం కిటకిటలాడింది. సుమారు 12 కిలోల బరువున్న మేతపోతు రూ.15 వేలు పలికింది. సుమారు 16 కిలోల బరువున్న గొర్రెపొట్టేలును రూ.20 వేలకుపైబడి కొనుగోలు చేశారు. కేజీన్నర బరువున్న నాటుకోడి పుంజు రూ.1,500లు పలికింది. సాధారణ రోజుల్లో ఇంతే బరువున్న పుంజులు రూ.700-800 ధరకు లభించేవి. దసరా పండుగ కావడంతో పెంపకందారులు అమాంతం ధరలు పెంచేశారని కొనుగోలుదారులు వాపోతున్నారు.