Share News

దసరా కిక్‌

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:30 AM

దసరా కిక్‌

దసరా కిక్‌

పండుగ రోజు జిల్లాలో సుమారు రూ.12 కోట్ల మద్యం విక్రయాలు

గత ఏడాదితో పోలిస్తే తగ్గాయంటున్న వ్యాపారులు

మరో రూ.25 కోట్ల మేర మటన్‌,

రూ.2 కోట్ల మేర కోడి మాంసం అమ్మకాలు

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

పండుగ రోజున మద్యం అమ్మకాలు బాగానే సాగాయి. గడిచిన ఏడాది స్థాయిలో కాకపోయినా వ్యాపారం మాత్రం మెరుగ్గానే జరిగినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా దసరా రోజు మటన్‌, చికెన్‌ అమ్మకాలు కూడా భారీగా ఉంటాయి. అయితే, ఈ ఏడాది తగ్గుముఖం పట్టినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గ్రూపులుగా ఏర్పడి మేకలు/గొర్రెలను కొనుగోలు చేసుకుని, వాటాలు వేసుకోవడమే అందుకు కారణమంటున్నారు. ఇకపోతే, మద్యం అమ్మకాలు కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదని, మంగళవారం సుమారు రూ.12 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇది ఎక్కువే అయినప్పటికీ...దసరా రోజు జరగాల్సిన స్థాయిలో అమ్మకాలు లేవని చెబుతున్నారు. నగరంలో ఎన్నికల సందడి ప్రారంభం కావడం, అభ్యర్థులు ఇప్పటికే మద్యం పంపిణీ చేస్తుండడంతో దుకాణాల్లో అమ్మకాలపై కొంత ప్రభావం పడినట్టు తెలుస్తోంది. అయితే, దసరా రోజు ఉదయం, సాయంత్రం మాత్రం మందుబాబులతో దుకాణాలు కళకళలాడాయి.

సుమారు రూ.25 కోట్ల మటన్‌ అమ్మకాలు

జిల్లాలో దసరా పండగ సందర్భంగా సుమారు 15 వేల వరకు జీవాలు (మేకలు, గొర్రెలు) కోసినట్టు చెబుతున్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా యూనియన్లు, చిట్టీలు నిర్వహించేవాళ్ల ఆధ్వర్యంలో అనేకచోట్ల జీవాల వధ జరిగింది. వీరి ద్వారా 1.5 లక్షల కిలోల మటన్‌ పంపిణీ జరిగి ఉంటుందని, మరో లక్ష కిలోల వరకు నగర పరిధిలోని సుమారు 500 వరకు దుకాణాల్లో అమ్ముడైనట్టు చెబుతున్నారు. మొత్తం కలిపి సుమారు రూ.25 కోట్ల మటన్‌ విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గడిచిన ఏడాదితో పోలిస్తే మటన్‌ దుకాణాల వద్ద అమ్మకాలు మాత్రం భారీగా తగ్గుముఖం పట్టినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. నగర పరిధిలో సుమారు వేయి వరకు ఉన్న చికెన్‌ దుకాణాల్లో సగటున 150 కిలోల చొప్పున అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ వ్యాపారం సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా మద్యం, మటన్‌, చికెన్‌ విక్రయాలు కలిపి సుమారు రూ.40 కోట్లకుపైగా వ్యాపారం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 01:30 AM