శరవేగంగా దార్లపూడి అక్విడెక్టు పనులు
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:44 AM
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో అత్యంత కీలకమైన అక్విడెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద ఈ భారీ నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టు సంస్థలు మూడు షిఫ్ట్టుల్లో పనులు చేపడుతున్నారు.
- పోలవరం ఎడమ ప్రధాన కాలువలో కీలక నిర్మాణం
- సుమారు 150 నుంచి 200 మీటర్ల పొడవు
- ఉత్తరాంధ్రకు నీటి విడుదల లక్ష్యంగా పనులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో అత్యంత కీలకమైన అక్విడెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద ఈ భారీ నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టు సంస్థలు మూడు షిఫ్ట్టుల్లో పనులు చేపడుతున్నారు.
పోలవరం ఎడమ కాలువ ప్యాకేజీ-5బీ పరిధిలో చేపడుతున్న ఈ పనుల కోసం సవరించిన అంచనాల ప్రకారం రూ.1,050 కోట్లకుపైగా నిధులు కేటాయించారు. ఇటీవల జిల్లాలో రాంబిల్లి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ఎడమ కాలువ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో 5బీ, 6, 7, 8 ప్యాకేజీల ఎడమ కాలువ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అనుసంధానం చేసి జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు జిల్లాలో ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన 5బీ, 6, 7, 8 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు వేగం పుంజుకున్నాయి. పాయకరావుపేట నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు మూడు ప్యాకేజీల కింద చేపట్టిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఆరవ ప్యాకేజీలో పాయకరావుపేట దుర్గానగర్ ప్రాంతంలో ఇప్పటికే భారీ కొండను తొలచి చేపట్టిన కాలువ తవ్వకం పనులు తుది దశకు చేరాయి. కొండ ప్రాంతంలో కాలువ పనులు పూర్తి చేసి రెండు వైపులా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల, సీతంపాలెం, జగన్నాథపురం ప్రాంతాల్లో అండర్ పాస్‌లు, గతంలో అసంపూర్తిగా వదిలేసిన వంతెనల నిర్మాణ పనులు చేపట్టారు. తుని, పాయకరావుపేట మధ్య అక్విడెక్టు నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేశారు. 7వ ప్యాకేజీ కింద ఎలమంచిలి నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు సుమారు 52 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వకం పనులు జరుగుతున్నాయి. 8వ ప్యాకేజీ కింద అనకాపల్లి మండలం పిసినికాడ వద్ద ఏలేరు కాలువకు పోలవరం నీటిని అనుసంధానం చేయనున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక పరుగులు
గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం విడతలుగా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు కాంట్రాక్టు సంస్థలకు పెండింగ్ బిల్లులను కూడా చెల్లించింది. ఉత్తరాంధ్రకు సాగు, తాగునీటి సరఫరా లక్ష్యంగా ఇప్పటికే పాయకరావుపేట పరిధిలో ప్యాకేజీ-5బీ కింద దుర్గానగర్, రాజీవ్‌నగర్ కాలనీల వద్ద కొండలను తొలచి చేపట్టిన కాలువ పనులు తుది దశకు చేరాయి. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో కీలక ఘట్టంగా భావిస్తున్న దార్లపూడి అక్విడెక్టు పనులు వేగవంతం చేశారు. భారీ కాంక్రీట్ పిల్లర్లు, గిర్డర్లు, బాక్స్ తరహా కాలువ నిర్మాణాలతో ఈ అక్విడెక్టు రూపుదిద్దుకుంటోంది. సుమారు 150 నుంచి 200 మీటర్ల పొడవున పనులు జరుగుతున్నాయి. వాగు ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం, గిర్డర్ల అమరిక, కాలువ లైనింగ్ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి. పోలవరం ఎడమ కాలువ ప్యాకేజీ 5బీ పరిధిలో చేపట్టిన ఈ పనుల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించి వేగవంతం చేయడంతో నిర్మాణ ప్రాంతంలో యంత్రాలు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రతి రోజూ పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడవులోగా పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ఈ నెలాఖరుకు ప్రధాన సివిల్ పనులు పూర్తి చేసి, ఆగస్టు నాటికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పోలవరం జలాలను విడుదల చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.