ప్రమాదభరితం.. ఘాట్ ప్రయాణం!
ABN , Publish Date - Aug 21 , 2026 | 10:31 PM
పాడేరు ఘాట్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా తుప్పలు పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఘాట్‌లో మలుపుల వద్ద స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనాల ప్రమాదాలు సర్వసాధారణమైంది. దీంతో ప్రయాణికులు, చోదకులు, పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తోంది.
రోడ్డు మలుపుల్లో ఏపుగా పెరిగిన తుప్పలు
జంగిల్ క్లియరెన్స్ చేయించని ఆర్‌అండ్‌బీ అధికారులు
అవస్థలు పడుతున్న వాహన చోదకులు
తొలగించాలని వేడుకుంటున్న ప్రయాణికులు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
పాడేరు ఘాట్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డుకు ఇరువైపులా దట్టంగా తుప్పులు పెరిగాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వడం ఒక సమస్య అయితే.. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించలేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో స్థానిక ఘాట్‌లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఘాట్‌లో ఇరువైపులా ఉన్న తుప్పుల కారణంగా డ్రైవర్లు వాహనాల రాకపోకలను సకాలంలో గుర్తించడం కష్టంగా మారుతుంది. ఈక్రమంలో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని పలువురు డ్రైవర్లు అంటున్నారు. ఈ విధంగా రోజుకు కనీసం రెండు వాహనాలు ఘాట్‌లో ప్రమాదాలకు గురవుతున్నాయని వారంటున్నారు.
ఘాట్‌లో పెరుగుతున్న వాహనాల రాకపోకలు
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే.. ఘాట్ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 26 కిలోమీటర్లు ఘాట్ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంతో పోల్చితే వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్ మార్గం నిత్యం వాహనాలతో రద్దీతోపాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2023 ఆగస్టు 20న ఘాట్‌లో వ్యూపాయింట్‌కు సమీపంలోని ఓ మలుపు వద్ద చెట్టు కొమ్మను ఆర్‌టీసీ బస్సు ఢీకొని లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 26 మంది గాయాల పాలైన ప్రమాదాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. రోడ్ల, భవనాల శాఖాధికారులు స్పందించి ఘాట్ మార్గంలో ప్రమాదకరంగా ఉన్న తప్పులను తొలగించాలని డ్రైవర్లు, ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు.