హైవేపై డేంజర్ బెల్స్ ప్రాణాలు తీస్తున్న
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:17 AM
భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా నగరంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనంలో ఏదైనా సమస్య తలెత్తితే నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. కనీసం వెనుకవచ్చే వాహనచోదకులు అప్రమత్తం అయ్యేలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో రాత్రివేళ వేగంగా వచ్చే వాహనచోదకులు ఆగి ఉన్న లారీని గమనించేలోపు ప్రమాదం జరిగిపోతోంది.
భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం
ఏ సమస్య తలెత్తినా రోడ్డుపైనే నిలిపివేస్తున్న వైనం
రాత్రివేళ వాటిని గమనించని వాహన చోదకులు
తరచూ ప్రమాదాలు
పట్టించుకోని హైవే పెట్రోలింగ్ పోలీసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా నగరంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనంలో ఏదైనా సమస్య తలెత్తితే నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. కనీసం వెనుకవచ్చే వాహనచోదకులు అప్రమత్తం అయ్యేలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో రాత్రివేళ వేగంగా వచ్చే వాహనచోదకులు ఆగి ఉన్న లారీని గమనించేలోపు ప్రమాదం జరిగిపోతోంది.
తగరపువలస నుంచి లంకెలపాలెం వరకు సుమారు 25 కిలోమీటర్లు జాతీయ రహదారి నగరం మధ్య నుంచి విస్తరించి ఉంది. అనందపురం జంక్షన్ నుంచి అనకాపల్లి వరకు కొత్తజాతీయ రహదారి అందుబాటులోకి వచ్చినప్పటికీ టోల్‌గేట్‌లను తప్పించుకునేందుకు రాత్రివేళ భారీవాహనాలు నగరం మధ్య నుంచి ఉన్న రహదారిపైనే రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రి పది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు వందలాది కంటెయినర్లు, టిప్పర్లు, తారస్‌లారీలు నగరం మీదుగా వెళుతుంటాయి. భారీ వాహనాలు కావడం, చాలాదూరం నుంచి ప్రయాణం చేయడంతో రోడ్డు రాపిడికి టైర్లు ఒక్కోసారి వేడెక్కిపోయి బరస్ట్ అవుతుంటాయి. మరికొన్ని వాహనాలకు అయితే ఇంజన్ ఏకధాటిగా పనిచేయడంతో సాంకేతిక లోపం తలెత్తి మొరాయిస్తుంది. దీనివల్ల నగర పరిధిలో ప్రతిరోజూ రాత్రి సమయంలో ఐదు నుంచి పది వాహనాలు రోడ్డుపక్కన, మార్జిన్ మధ్యలో నిలిచిపోతుంటాయి. ఇలాంటి వాహనాలను డ్రైవర్లు రోడ్డు మధ్య నుంచి పక్కకు తీసి, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆగిన వాహనం అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేకపోతే వెనుక నుంచి వచ్చే వాహనచోదకులు దూరం నుంచే గమనించేలా ఇండికేటర్ లైట్లు ఆన్ చేసి ఉంచడం, లేదంటే రేడియం స్టికర్లను అతికించడం, వాహనానికి కొంతముందుగానే స్టాపర్లు పెట్టి వాటికి రేడియం స్టిక్కర్లు అతికించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వెనుక నుంచి వచ్చే వాహన చోదకులు దూరం నుంచే నిలిచిపోయి ఉన్న వాహనాన్ని గుర్తించి సురక్షితంగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
రోడ్డుమధ్యనే ఆపేస్తున్న వాహనాలు... తరచూ ప్రమాదాలు
నగర పరిధిలో భారీవాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏదైనా రిపేరు తలెత్తితే రోడ్డు మధ్యనే వాహనాన్ని వదిలేస్తున్నారు. దీనివల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు ముందు వాహనం నిలిచి ఉందనేది సకాలంలో గుర్తించలేకపోతున్నారు. దగ్గరకు వచ్చిన తరువాత గుర్తించినాసరే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ముందు వాహనాన్ని ఢీకొట్టేస్తున్నారు. కొన్నాళ్ల కిందట కంచరపాలెం వద్ద జాతీయ రహదారిపై నిలిచివున్న చెత్త లోడ్ కంటెయినర్‌ను వెనుక నుంచి వచ్చిన వాహనచోదకుడు గమనించకపోవడంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. తాజాగా గాజువాక శ్రీనగర్ జంక్షన్‌లో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బబస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు నగరంలో చాలానే జరిగినప్పటికీ పోలీసులు మాత్రం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేసేందుకు గస్తీ తిరగాల్సిన హైవే పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది ఆగిపోయిన వాహనాల నుంచి మామూళ్లు తీసుకుని ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.